తెలంగాణాలో ఉత్తమ పారిశ్రామిక విధానం

5
పెట్టుబడులకు ఇదే అనువైన రాష్ట్రం

రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదారబాద్‌, జులై 4 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సచివాలయంలో సీ బ్లాకులో గల తన చాంబర్‌లో సమీక్షించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ పీకే శ్రీవాత్సవతో పాటు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో రైల్వే ట్రాన్స్‌పోర్టు సిస్టంను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను సమూలంగా మార్చి పూర్తిగా ఆధునీకరించాలని సీఎం సూచించారు. తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు రప్పించడంతో పాటు, రైల్వే ఆధునికీకరణ కోసం త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి, పెద్దపల్లి, నిజామాబాద్‌ లైన్ల కోసం కృషి చేయాలన్నారు. కాజీపేట డివిజన్‌ విషయంలో చొరవ చూపాలని, వేగన్‌ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్‌లో రైల్వే ట్రాన్స్‌పోర్టు సిస్టంను అభివృద్ధి చేయాలన్నారు. సికింద్రాబాద్‌స్టేషన్‌ను సమూలంగా మార్చాలని అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ తూప్రాన్‌, శంషాబాద్‌ వరకు పొడిగించాలన్నారు. దేశంలోనే ఉత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో రూపొందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నకానో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో కలిసి పని చేద్దామని విద్యుదుత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని హావిూ ఇచ్చారు. అనంతర సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. సమగ్ర విధాన రూపకల్పనకు మరో నెలరోజులు పడుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో మరో హైదరాబాద్‌ను చూస్తారని కేసీఆర్‌ అన్నారు. ఇదిలావుంటే సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను ఎంపీ రేణుకా చౌదరి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానిని రేణుక తెలిపారు.