బ్రిక్స్ దేశాల సమావేశానికి హాజరుకానున్న మోదీ, జైట్లీ
న్యూఢిల్లీ, జూలై 7 : పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్రెజిల్ వెళ్లనున్నారు. అక్కడ బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. నాలుగు రోజుల పర్యటనలో పదికి పైగా దేశాల అధినేతలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటి అధికారిక పర్యటన ఇదే.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి జైట్లీ ఈనెల 10న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతాయి. కానీ ఈ నెల 13న మోదీ, జైట్లీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. బ్రెజిల్‌లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు వారు హాజరవుతారు. బ్రిక్స్ దేశాలకు ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటే ఈసారి సదస్సు ఎజెండా. అక్కడ పలు దేశాల అధినేతలను వీరు కలవనున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, జైనా అధ్యక్షుడు జి జింపింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో మోదీ సమావేశమవుతారు. బ్రిక్స్ ప్రధాన సదస్సు తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు బ్రిక్స్ దేశాలతోపాటు లాటిన్ అమెరికన్ దేశాల అధినేతలకు బ్రెజీలియా నగరంలో అతిథ్యం ఇవ్వనున్నారు. అక్కడ నాయకుల మధ్య ముఖాముఖి చర్చలు జరుగుతాయి. రష్యా, చైనా దేశాల అధినేతలతో మోదీ సమావేశాలపైనే దృష్టి కేంద్రీకృతం కానుంది. జి జింపింగ్ వచ్చే సెప్టెంబర్‌లో భారత్ వచ్చే అవకాశం ఉంది.