రైల్వే బడ్జెట్‌పై అందరి దృష్టి

3

బడ్జెట్‌ చూశాకే మోడీపై అంచనా

న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి) :

కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై అందరి దృష్టి నెలకొంది. తమను పాలకులుగా ఎన్నుకుంటే మంచి రోజులు వస్తాయని ప్రచారంలో ఊదరగొట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వం రైల్వేబడ్జెట్‌కు ముందే ప్రయాణ చార్జీలను 14 శాతం, సరుకు రవాణా చార్జీలను ఆరు శాతం పెంచేసి సామాన్యుడి నడ్డి విరిచింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. రైల్వే బడ్జెట్‌ ద్వారా మోడీ తన పాలన విధానాలు బహిర్గత పరిచే అవకాశమున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులేవి ఉండబోవంటూ రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపై అంతగా ఆశలు పెట్టుకోలేదు. అయినా తనవంతు ప్రయత్నాలు తుది వరకు చేసింది. ఖాజీపేట రైల్వే డివిజన్‌, కోచ్‌ ఫ్యాక్టరీ, దశాబ్దాల తరబడి నలుగుతున్న కొత్త రైల్వేలైన్లు, కొత్త రైళ్లు, సింగరేణి ప్రాంతాలకు రైల్వే లైన్ల విస్తరణపై కేంద్రం ఏమాత్రం కరుణ చూపుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు రైల్వేల ఆధునీకరనకు శ్రీకారం చుడతామని, అత్యాధునిక రైల్వేలను ప్రవేశ పెడతామని, బుల్లెట్‌ ట్రైన్స్‌ తీసుకుని వస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైల్వేమంత్రిగా ఉన్నా ఇంతకాలం ఆ రాష్ట్రానికే మేలు జరిగింది. రైల్వే మంత్రుల కోరికల ప్రకారం కొత్త రైళ్లు, రైలుమార్గాలు ప్రకటిస్తూ నిధులు గుమ్మరించారు. ఈ నేపథ్యంలో సదానందగౌడ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. రైల్వేల ద్వారా నిత్యం రెండుకోట్ల మంది ప్రయాణికులతో పాటు యేటా వందకోట్ల టన్నుల సరకులను రవాణా జరుగుతోంది. అయినా బ్రిటిష్‌ పాలకులు అప్పట్లో నిర్మించిన వివిధ వంతెనలు, పట్టాలపైనే ఇప్పటికీ పలు రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతమున్న పురాతన రైల్వే వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునికీకరించాలంటే, లక్షల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అభివృద్ధికారక ప్రాజెక్టుల పూర్తికి ఇప్పుడైతే రైల్వేల వద్ద నిధులు లేవు. ప్రభుత్వ-ప్రైవేటు  ఆయా విధానాలపై సర్కారు తగిన నిర్ణయాలు తీసుకోవాలని దశాబ్దాల కిందటే పలు కమిటీలు సిఫార్సులు చేశాయి. ఈ దశలో దేశహితమే లక్ష్యంగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ద్వారా ప్రధాని మోడీ తన పాలన నిస్వార్థమని నిరూపించుకోవాల్సిన సమయమిది. రాజకీయ దృక్పథంతో కాకుండా భారత ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా వ్యవహరిచి, ప్రణాళికబద్ధంగా కృషి సాగించి, రైల్వే వ్యవస్థను పటిష్ట పరుస్తామని  బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఇది అక్షరసత్యమని ఈ బడ్జెట్‌ ద్వారా నిరూపించుకోవాల్సి ఉంది. మోడీ సర్కారు రైల్వేల ఆధునీకరణపై దృష్టి సారిస్తుందా? ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందా అనేవి తేలాలంటే మంగళవారం మధ్యాహ్నం వరకు వేచిచూడాల్సిందే.