పారదర్శకత, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: రైల్వేలను దేశ ప్రగతి చోదకంగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడి మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పారదర్శకత, ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.లోక్ సభలో మంగళవారం రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రూ. 1,49,176 కోట్ల రైల్వే బడ్జెట్, ‘‘పారదర్శకత, సమగ్రత’’తో పాటు ప్రమాణికుల భద్రతావసరాలను ప్రధానంగా ఆవిష్కరించిందని అనంతరం ఆయన వ్యాఖ్యానించారు.‘‘భారతదేశ అభివృద్ధిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నాన్ని కూడా చూడవచ్చు’’ అని మోడి అన్నారు. ‘‘రైల్వేల పయనం ఎటువైపో అన్న అంశంతోపాటు అదే సమయంలో రైల్వేల ద్వారా భారతదేశాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలన్నది కూడా ఈ బడ్జెట్ స్పష్టం చేస్తోంది’’ అని ప్రధాని చెప్పారు. దేశ ప్రగతిలో రైల్వేలు ‘‘చాలా ముఖ్యమైన పాత్ర’’ పోషిస్తాయని ఆయన అన్నారు. ‘‘1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైల్వేలపై దేశం శ్రద్ధ పెట్టాల్సింది. ఇప్పటికైనా సమయం మించి పోలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.