అమిత్ షా న్యాయవాదికి సుప్రీం జడ్జిగా పదోన్నతి!!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉదయ్ యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరఫున రెండు క్రిమినల్ కేసుల్లో వాదించిన లలిత్కు ఇప్పుడీ పదోన్నతి లభించింది. గత నెలలోనే మాజీ సాలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం తిరస్కరించిన తర్వాత.. ఇప్పుడీ నియమాకానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
లలిత్తో పాటు మరో ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ న్యాయమూర్తుల పదవులకు ఎంపిక చేసింది. సోహ్రాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతిల బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో అమిత్ షా తరఫున ఉదయ్ లలిత్ వాదించారు. ఈ రెండు కేసుల్లోనూ హత్య, కుట్ర ఆరోపణలు అమిత్ షా మీద వచ్చిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమితులయ్యే న్యాయవాదుల్లో లలిత్ ఆరోవారు అవుతారు. 2జీ స్పెక్ట్ర్రం స్కాం కేసులో ఆయన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రఫుల్ చంద్ర పంత్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మోహన్ సాప్రే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. భానుమతి కూడా సుప్రీం న్యాయమూర్తులుగా వెళ్లనున్నారు.