పెద్దల సభ సాక్షిగా ఆదివాసీలను ముంచేశారు

55A5C

అడవి బిడ్డల జీవితాలతో ఆడుకోవద్దు : కేకే

మోడీ, రాజ్‌నాథ్‌.. భద్రాచలం ఏజెన్సీకి రండి : వీహెచ్‌

బిల్లును వ్యతిరేకించిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు

రంగుమార్చిన కాంగ్రెస్‌.. బిల్లుకు మద్దతు

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) :

పెద్దల సభ సాక్షిగా అమాయక ఆదివాసీలను ముంచేశారు. పోలవరం వల్ల 2 లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులు అవుతారని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎంపీలు గట్టిగా వాదించినా వినిపించుకోలేదు. ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. రాజ్యసభలో అత్యధిక ఎంపీల బలమున్న కాంగ్రెస్‌ పార్టీ మద్దతివ్వడంతో బిల్లు ఏకపక్షంగా సభ అనుమతి పొందింది. పోలవరం కట్టాల్సిందేనని జైరాం రమేశ్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలువగా తెలంగాణ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. 2 లక్షల మంది గిరిజనులను ముంచే ఈ ప్రాజెక్ట్‌ మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని, ఆ కోణంలో ఆలోచించాలని చెప్పారు.

ఆర్టికల్‌ 3 ప్రకారం సరిహద్దులు మార్చాలి : కెకె

ఈ బిల్లును  వ్యతిరేకిస్తున్నామని తెరాస ఎంపీ కె. కేశవరావు రాజ్యసభలో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను చర్చించకపోవడం రాజ్యాంగవిరుద్ధమని కేకే పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని కేశవరావు మరోసారి పునరుద్ఘాటించారు. పోలవరం పేరుతో లక్షలమంది  గిరిజనులను ముంచేందుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టును ముంపు ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలన్నారు. రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా సరిహద్దులు ఎలా మారుస్తారు అని ప్రశ్నించారు. వందలాది గ్రామాల్లో ఉన్న ప్రజల జీవితాలు పట్టించుకోరా అని అడిగారు. పోలవరం వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. పోలవరం ప్రభావిత రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ప్రాజెక్టును మానవతా కోణంలో చూడాలని ¬ంమంత్రిని కోరుతున్నానని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైయ్యే ఏడు మండలాలలను ఆంధప్రదేశ్లో కలపడాన్ని టీఆర్‌ఎస్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉండగా, నోటీసు ఇచ్చినప్పటికీ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్‌ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి  నిరాకరించారు. అయితే పోలవరం బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యుడు జైరామ్‌ రమేష్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మాట్లాడారు.

భద్రాద్రి రాముడూ మునుగుతాడు : రేణుక

పోలవరం వల్ల ఖమ్మం జిల్లా ప్రత్యక్షంగా ప్రభావితమవుతుందని కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు.  చర్చలో ఆమె మాట్లాడుతూ పోలవరం లక్షన్నర మంది గిరిజనులకు నష్టం కలిగిస్తుందన్నారు. ఇది కేవలం రెండు రాష్ట్రాల సమస్య కాదని విశాల దృక్పథంతో దీన్ని చూడాలని ఆమె పేర్కొన్నారు. పోలవరం వద్దంటూ వందలమంది గిరిజనులు ఢిల్లీ వచ్చి ఆందోళన చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు మునిగిపోతున్నాయని, భద్రాచలం ఆలయానికి చెందిన 900 ఎకరాలు ముంపునకు గురవుతోందని ఆమె చెప్పారు. ముంపు బాధితులకు పూర్తిగా న్యాయం జరగాలని రేణుక కోరారు. భద్రాచలం ఉనికికే ప్రమాదముందన్నారు. అలాగే దేవాలయ భూములు ముంపునకు గురవుతే దేశుడికెవరు దిక్కన్నారు. గిరజనులకు న్యాయం చేసేదెలా అని అన్నారు.

నష్టం లేదు : రాజ్‌నాథ్‌సింగ్‌

అంతకుముందు ఆంధప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌   రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల వారికి ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు.1958లో ముంపు గ్రామాలు ఆంధప్రదేశ్‌లోనే ఉండేవని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్‌ను  లోక్‌సభ ఆమోదించిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్‌ వల్ల ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన  తెలిపారు. పోలవరం ముంపు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలిపే ఈ సవరణ బిల్లుకు లోక్‌సభ ఇంతకు ముందే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సవరణ బిల్లు వివరాలను ¬ంమంత్రి సభకు వివరించారు. అయితే కాంగ్రెస్‌ అనూహ్యంగా  రాజ్యసభలో పోలవరం బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టిన ఈ బిల్లును లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే.

సవరణ బిల్లుకు జైరాం రమేష్‌  మద్దతు

సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ సవరణ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మొదటినుంచి జరిగిన విషయాలతో పాటు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌  ప్రభుత్వాలు దీనికి అడ్డుపడుతున్న వైనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాగా, పోలవరంపై తీర్మానం, బిల్లు రెండింటివిూదా కలిపి ఒకేసారి చర్చ జరుగుతుందని, ఓటింగ్‌ మాత్రం విడివిడిగా తీర్మానానికి, బిల్లుకు రెండు సార్లుగా జరుగుతుందని రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ తెలిపారు. బిల్లు, తీర్మానం విషయమై టీఆర్‌ఎస్‌ సభ్యుడు కె.కేశవరావు ఆవేశంగా ప్రసంగించిన తర్వాత, సుజనా చౌదరికి ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో రాజకీయ కోణం చూద్దామంటూ తీర్మానం విషయంలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అయితే తప్ప అధ్యక్ష స్థానంలో ఉన్నవారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత జైరాం రమేష్‌కు  మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా, ఈలోపు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తదితరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇంతలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  లేచి ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తలపెట్టిన సవరణలను చదివి వినిపించారు. మళ్లీ వీహెచ్‌ లేచి నినాదాలు చేయబోగా కురియన్‌ మాత్రం జైరాం రమేశ్‌కే అవకాశం ఇచ్చారు. తెలంగాణకు హైదరాబాద్‌ ఎలాగో.. ఆంధప్రదేశ్‌కు  పోలవరం అలాంటిదని జైరాం రమేష్‌ చెప్పారు. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు అని, 7 లక్షల ఎకరాలు సాగవుతాయని, 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్‌కు వెళ్లడం వల్ల తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా దానివల్ల ఉపయోగమేనని ఆయన తెలిపారు. దాని సాంకేతిక డిజైన్ను కేంద్ర జలసంఘం ఆమోదించిందని అన్నారు. దీనికి 16వేల కోట్ల నిధులు ఖర్చవుతాయని, ఇందులో ఇప్పటికి దాదాపు 30 శాతం పూర్తయిందని వివరించారు. తాను మూడుసార్లు స్వయంగా మూడుసార్లు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లానని అన్నారు. ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలున్నా, దానివల్ల చాలా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఖమ్మం జిల్లాలో వందలాది గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి సుమారు 45 వేల కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ కుటుంబాలు ఉన్నాయన్నారు. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను ఆ రెండు రాష్ట్రాలకు ఖర్చుపెడతామని చెప్పిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కొన్ని ప్రాంతాల ప్రజలను తప్పనిసరిగా అక్కడినుంచి తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలు తొలుత తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే ఉండేవని, ప్రాజెక్టు ఒక రాష్ట్రంలోను, ప్రజలను వేరే రాష్ట్రంలోను తరలించాల్సి రావడం అసాధ్యమని, అవన్నీ ఒక రాష్ట్రంలో ఉండటమే న్యాయమని జైరాం రమేష్‌ తెలిపారు. ఈ సమయంలో వీహెచ్‌ మళ్లీ లేచి ఏదో మాట్లాడుతుండగా.. విూ సొంత పార్టీ సభ్యుడే మాట్లాడుతున్నారని, ఇలా చేయొద్దని కురియన్‌ ఆవేశంగా హెచ్చరించారు. ఒడిషా, ఛత్తీస్గఢ్‌ ప్రభుత్వాల అభ్యంతరాలను పరిష్కరించేవరకు ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేది లేదంటూ తాను స్వయంగా అడ్డుపడ్డానని, అప్పుడు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాతే అనుమతులు వచ్చాయని అన్నారు. ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభిప్రాయం సేకరించాలని కోరుతున్నా, అందుకు ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీకి పంపిన బిల్లులో ప్రాజెక్టు కట్టాలనే చెప్పాం తప్ప గ్రామాల బదిలీ గురించి చెప్పలేదన్నారు. తర్వాత షిండే అధ్యక్షతన నిర్వహించిన జీవోఎం సమావేశంలో వచ్చిన సూచనల మేరకు ఏడు మండలాలను ఖమ్మం నుంచి ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలని జీవోఎం నిర్ణయించిందన్నారు. దీనికి తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని, భద్రాచలం రామాలయానికి వెళ్లే దారి ఆంధ్రలోను, భద్రాచలం తెలంగాణలోను ఉంటే కష్టమని చెప్పడంతో మరోసారి జీవోఎం సమావేశమై.. కేవలం ముంపు ప్రాంతాలను మాత్రమే ఆంధప్రదేశ్‌కు తరలించాలని నిర్ణయించిందన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న లోక్సభకు, 20న రాజ్యసభకు బిల్లు వచ్చిందన్నారు. దానిపై ప్రధానమంత్రి కూడా ఒక ప్రకటన చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు అమలు కోసం బిల్లుకు ఎలాంటి సవరణలు కావాలన్నా చేయొచ్చని ఆయన చెప్పారన్నారు. ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని తెలిపారన్నారు. ఏడు మండలాలు తరలించాలన్న మొదటి సూచనను తెలంగాణ ప్రతినిధులు, ముంపు గ్రామాలను మాత్రమే తరలించాలన్న రెండో సూచనను ఆంధ్రా ప్రతినిధులు వ్యతిరేకించడంతో కేంద్ర కేబినెట్‌ సమావేశమై ఆరు మండలాలను పూర్తిగాను, భద్రాచలం మండలాన్ని పాక్షికంగాను తరలించాలన్న మూడో సూచన చేసిందన్నారు. అయితే అప్పటికి ఎన్నికల కోడ్‌ రావడంతో తర్వాత ప్రభుత్వానికి దీన్ని వదిలిపెట్టామని జైరాం రమేష్‌ తెలిపారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని, అయితే నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలని ఛత్తీస్‌గఢ్‌ భాజపా ఎంపీ నందకుమార్‌ అన్నారు. పోలవరం వల్ల ముంపునకు గురయ్యే అటవీసంపదపై కూడా ఆలోచించాలని ఆయన అన్నారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఒడిశా ప్రయోజనాలను కాపాడాలని బీజేడీ ఎంపీ కల్పతరుదాస్‌ అన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ ఒడిశాకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. నాలుగు రాషాలె సీఎంలతో మాట్లాడి కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.  పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని, రాష్ట్రాలకు సంబంధించింది కాదని సీపీఐ సభ్యులు డి. రాజా అన్నారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా డిజైన్‌ మార్చాలని ఆయన సూచించారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే గిరిజనులకు పునరావాసం కల్పించాలన్నారు. ముంపు ప్రాంతాల బదలాయింపుపై ఇరు రాష్టాల్రతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

పోలవరం కట్టి రాజమండ్రి నగరాన్ని ముంచుతారా : రాపోలు

పోలవరం కట్టి రాజమండ్రి నగరాన్ని ముంచుతారా అని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ కేంద్ర ¬ంమంత్రిని ప్రశ్నించారు. పోలవరంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీని అభివృద్ధి చేస్తారా.. నాశనం చేస్తారా అని అడిగారు. పోలవరాన్ని పొరుగు రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కేంద్రం తెలుసుకోవాలని విన్నవించారు. పోలవరం వల్ల భద్రాచలం కూడా ముంపునకు గురవుతుందని తెలిపారు. పోలవరం వల్ల 4 లక్షల మంది గిరిజనులు నిరాశ్రయులు అవుతున్నారని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.  పోలవరం వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుందని, ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు ఆందోళనలో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. 4 లక్షల మంది ఆవేదనను కేంద్ర ¬ంమంత్రి అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువని పలు నివేదికలు పేర్కొన్నాయని ఆయన గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం ఎంపీ రాజీవ్‌ అన్నారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్న ఆయన, రాష్ట్రాల ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చినట్లు సరిహద్దులు మార్చవచ్చా అనేది చర్చించాలన్నారు. నిర్వాసితుల విషయమై లోతుగా ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనగా ఉన్నారని ఒడిశా ఎంపీ మహాపాత్ర అన్నారు. లక్షల మంది గిరిజనుల జీవితాలతో ఆటలు ఆడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని బీహార్‌కి చెందిన ఎంపీ కేసీ త్యాగి అన్నారు. బీహార్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్న ఆయన విభజన నేపథ్యంలో ఆంధప్రదేశ్‌కి అడక్కుండానే ప్రత్యేక ¬దా ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఆంధప్రదేశ్‌కి ప్రత్యేక ¬దా ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఎన్డీసీ సమావేశం ఏర్పాటుచేసి ఇతర రాష్ట్రాల డిమాండ్లపై కూడా చర్చించాలన్నారు. రాజకీయ లబ్ది కోసం ఆంధప్రదేశ్‌ను విభజించారని, ఉత్తరప్రదేశ్‌ను 4 రాష్ట్రాలుగా విభజించాలని చూస్తున్నారని మరో సభ్యులు నరేశ్‌ అగర్వాల్‌ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు 4 రాష్ట్రాల సమస్య అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను అమలు చేయొద్దన్నారు.

ఇదో బహుళార్థసాధక ప్రాజెక్ట్‌ : చిరంజీవి

పోలవరం ప్రాజెక్టు బహుళార్దసాధక ప్రాజెక్టు అని అందరు తెలుసుకోవాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఇవాళ రాస్యసభలో పోలవరం ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చుతూ చేపడుతున్న చర్చపై ఆయన మాట్లాడారు. పోలవరం వల్ల ఎందరికో లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రెండు రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది వందలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నాయని వివరించారు. ప్రాజెక్టును కడితే నీటిని సద్వినియోగ పరచుకోవచ్చని, సాగునీటికి, తాగునీటికి వాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు, దీనివల్ల అందరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. గతంలో రామాలయం సహా భద్రాలచం అంతా ఆంధ్రా జిల్లా తూర్పుగోదావరిలో ఉండేదని గుర్తు చేశారు.

పోలవరం ప్రాంతాన్ని ప్రధాని మోడీ, రాజ్‌నాథ్‌ సందర్శించాలి : వీహెచ్‌

తాము పోలవరానికి వ్యతిరేకం కాదని.. డిజైన్‌కు మాత్రమే వ్యతిరేకమని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. రాజ్యసభలో పోలవరంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి గిరిజనుల సమస్యల్ని అర్ధం చేసుకోవాలన్నారు. రాజ్యసభలో పోలవరం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వీహెచ్‌ పోలవరం ప్రాజెక్టు తాము వ్యతిరేకం కాదంటూనే, డిజైన్‌ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అలా చేయకుండా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ ను యధాస్థితిలో చేపడితే ప్రక్కనే ఉన్న అమలాపురం ముంపుబారిన పడుతుందని వీహెచ్‌ తెలిపారు. పోలవరం డిజైన్‌ను మార్చి కట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల బాధితుల సమస్యలు అర్థం చేసుకోవాలని విన్నవించారు. గిరిజనుల సమస్యలు విూకు అర్థం కావడం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గతంలో ఎంతో అవినీతి జరిగిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి గతంలో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారని తెలిపారు. ప్రాజెక్టు స్థలాన్ని ప్రత్యక్షంగా చూసి గిరిజనుల సమస్యలను ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ తెలుసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదని, పోలవరం డిజైన్‌ మాత్రమే వ్యతిరేకిస్తున్నామని హనుమంతరావు తెలిపారు. పోలవరం పేరు చెప్పి గతంలో అవినీతి జరిగిందని ఆయన అన్నారు. రామమందిరం అంటున్న బీజేపీ.. భద్రాద్రి రాముడు గురించి ఎందుకు ఆలోచించదని ప్రశ్నించారు.

రాజ్యసభలో జేడీ శీలం, వీహెచ్‌ వాగ్వాదం

ఆంధప్రదేశ్‌ పునర్వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు జేడీ శీలం, వీహెచ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. జైరాం రమేశ్‌ కలగజేసుకుని వారికి నచ్చజెప్పారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపే సవరణను సమర్థిస్తున్నానని జేడీ శీలం అన్నారు. పోలవరం వల్ల గోదావరి జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు. పాలనాసౌలభ్యం కోసమే ముంపు గ్రామాలతో పాటు మండలాలనూ కలిపారన్నారు. ప్రస్తుతం పునరావాసం గురించే ఆలోచించాలని ఆయన అన్నారు. పోలవరం వల్ల నష్టపోయే గిరిజనుల గోడును కూడా వినిపించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ సూచించారు. రాజ్యసభలో పోలవరంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం వల్ల ఆదివాసీల జీవితాలు తారుమారు అవుతాయని పేర్కొన్నారు. గిరిజనులు నిరాశ్రయులు అవుతున్నారన్నదే తెలంగాణ ప్రజల బాధ అని చెప్పారు. పోలవరం పేరుతో తెలంగాణకు అన్యాయం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో పోలవరంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా బిల్లును ఎలా తీసుకోస్తారని ప్రశ్నించారు. పోలవరంతో ఖమ్మం జిల్లా గిరిజనులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ పునర్‌వ్యవ్థసీకరణ చట్టసవరణ బిల్లుకు మద్దతిస్తున్నానని ఎంపీ కేవీపీ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ కొందరు సభ్యులు గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. 1956కు ముందు భద్రాచలం డివిజన్‌ ఆంధప్రదేశ్‌లో భాగమని ఆయన గుర్తుచేశారు. పోలవరం చాలా పాత అంశమని, దానిపై ఎప్పటినుంచో చర్చలు జరిగాయని పేర్కొన్నారు.పోలవరం వల్ల మల్కన్‌గిరి జిల్లాపై తీవ్ర ప్రభావం పడుతదని ఒడిశా బీజేడీ ఎంపీ భూపేంద్రసింగ్‌ తెలిపారు. రాజ్యసభలో పోలవరంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కులు పట్టించుకోరా? ఇష్టం వచ్చినట్లు చేస్తారా అని ప్రశ్నించారు. గిరిజనుల అనుమతి లేకుండా వారి భూములు ప్రాజెక్టుకు ఎలా తీసుకుంటారు అని అడిగారు. ఈ ప్రాజెక్టు వల్ల మల్కన్‌గిరి జిల్లాలోని గిరిజనులు ముంపునకు గురవుతారని తెలిపారు.