మళ్లీ తెరపైకి నగదు బదిలీ
ఆధార్ అనుసంధాన్‌పై అధ్యయనం
న్యూఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి) :
నగదు బదిలీ పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. యూపీఏ పాలనకాలంలో లబ్ధిదారులకు ప్రభుత్వ రాయితీలు నేరుగా అందించేందుకు, రాయితీలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు దీనిని ఆధార్‌తో అనుసంధానం చేయాలని సంకల్పించింది. అయితే ఆధార్ చట్టబద్ధతపై కోర్టులో వివాదాలు, ఆధార్ కార్డుల జారీలో తీవ్ర జాప్యంతో అది అటకెక్కింది. ఎన్నికల్లో యూపీఏ దారుణ పరాజయంతో నగదు బదిలీ పథకం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. లబ్ధిదారుల గుర్తింపు, సబ్సిడీలు నేరుగా వారికే అందించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేసే విషయమై అధ్యయనం చేస్తోంది. అలాగే సబ్సిడీలు పొందుతున్న నకిలీ లబ్ధిదారులను తొలగించేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రణాళిక సంఘం, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సంయుక్తంగా నివేదికను రూపొందిస్తున్నాయి. గత యూపీఏ హయాంలో సుమారు 289 జిల్లాల్లో మార్కెట్ ధరకు వంట గ్యాస్ కొనుగోలు చేసిన వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో రాయితీ కింద ఒక్కో సిలిండర్‌కు రూ.435 జమ చేసింది. ఆధార్‌తో అనుసంధానంపై ఫిర్యాదులు వెల్లువెత్తిన కారణంగా దానిని నిలిపివేశారు.