ఇంకెన్నాళ్లు

‘కోర్టులో న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కావచ్చు.. కానీ గెలుస్తున్నదంతా న్యాయం కాదు’ అన్నాడు ఓ మహాకవి. ఇది చుండూరు సంఘటనకు అక్షరాల సరిపోతుంది. సరిగ్గా 23ఏళ్ళ క్రితం 8మంది దళితుల్ని అగ్రవర్ణాలకు చెందిన వారు అతి క్రూరంగా ఊచకోత కోశారు. ఇప్పటివరకు నిందితులకు శిక్ష పడలేదు. ఒక కోర్టులో ఒక న్యాయం.. మరో కోర్టులో మరో న్యాయం వెరసి చట్టం నిందితులకు రక్షణ కవచంలా నిలిచింది తప్ప బాధిత కుటుంబాలను పట్టించుకున్న పాపానపోలేదు. నాకెందుకో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన సూక్తి బహుశా ఇలాంటి సంఘటనలను ఊహించి చెప్పిందేనేమో అనిపిస్తోంది. ‘పోలీసుల, న్యాయ వ్యవస్థలో మనవాళ్ళు లేకపోతే మనకు న్యాయం జరుగదు అని ఆయన ఆనాడే ఉటంకించాడు. ఈ కోర్టుల్లో వెలువడుతున్న తీర్పులు కూడా మనకు అలాగే అనిపిస్తున్నాయి. న్యాయపీఠంపై ముస్లిం జడ్జి ఉన్నప్పుడు నిందితులకు శిక్ష పడింది. ఆ స్థానంలో ఓ అగ్రవర్ణానికి చెందిన జడ్జి రాగానే సహేతుక కారణాలు లేకుండానే దోషులు నిర్దోషులైపోయారు. సరైన సమయంలో ఫిర్యాదు చేయలేదని, సాక్ష్యాధారలు సరిగ్గాలేవని.. లాంటి కుంటిసాకులతో నిందితులను విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం.

1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన 8మంది దళితుల హత్యకేసులో సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్‌ 2007, జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించేంత అత్యంత అరుదైన కేసుల్లో ఒక కాదంటూ మొత్తం 179మంది నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. మిగిలిన వారిలో 21మందికి యావజ్జీవం, మరో 35మందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించారు. అయితే ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలను లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి.  అలాగే శిక్షపడిన వారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు కొందరిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లలో తమ శిక్షను రద్దుచేయాలంటూ శిక్ష పడిన వారు దాఖలు చేసుకున్న అప్పీళ్ళపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. చుండూరులో జరిగిన 8మంది దళితుల హత్యకేసులో ప్రత్యేక కోర్టు 21మందికి విధించిన యావజ్జీవ, శిక్షను, మరో 35మందికి విధించిన ఏడాది జైలుశిక్ష, జరిమానాను రద్దుచేసింది. సాక్షాల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రత్యేక కోర్టు వాటిని పట్టించుకోకుండా నిందితులకు జైలుశిక్ష విధించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇతర కేసుల్లో అవసరమైతే తప్ప ఈ 56మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. వీరి ఏమైనా జరిమానా మొత్తాలు వసూలు చేసిఉంటే వాటిని తిరిగి ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో చుండూరు, మోదుకూరు గ్రామాల్లో ఎటువంటి సంబరాలు, నిరసనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ గ్రామాలపై మూడు నెలలపాటు నిఘా ఉంచాలని గుంటూరు ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది. ‘గ్రామంలో భారీ బందోబస్తు ఉన్న సమయంలో ఈ హత్యలు, దాడులు చోటుచేసుకోగా ఈ హత్యల గురించి పోలీసులకు సమాచారం అందకపోవడం ఊహకందని విషయం.. మొదటి రెండు మృతదేహాలను తుంగభద్రకాలువ వద్ద 9వ సాక్షి గుర్తించేంత వరకు హత్య గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఆగస్టు 7వ తేదీన కూడా మృతుల కుటుంబీకులు తమ సంబంధీకులు కనిపించడం లేదంటూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సమాచారం అయినా ఇవ్వలేదు. ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్న వ్యక్తి హరిజన వర్గానికి నాయకుడు. తమపై జరిగిన దాడులకు సంబంధించి ఆయన కూడా ఎటువంటి సమచారంగానీ, ఫిర్యాదుగానీ ఇవ్వలేదు’ అని హైకోర్టు పేర్కొంది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అప్పటి రూరల్‌ ఎస్పీ జెక్కంశెట్టి సత్యనారాయణ ప్రకటించారు. దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించడంతో ప్రభుత్వం బాధితుల తరుపున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. చుండూరు మారణకాండ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేయడం ద్వారా విడుదల వారిని ఉద్దేశిస్తూ ‘మిమ్మల్ని ఎందుకు విచారించకూడదో’ చెప్పాలని ప్రశ్నించింది. అప్పీలుకు స్వీకరించిన కోర్టు మూడు వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్టే విధించాలని ఆదేశించింది. దీంతో తమకు తాత్కాలిక ఊరట లభించిందని దళిత సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

మైనారిటీలో, దళితులో, ఇతర అణగారిన వర్గాల వారో ఎదుర్కొంటున్న కేసుల్లో ఉరిశిక్ష, యావజ్జీవ విక్ష విధిస్తున్న న్యాయస్థానాలు దళితుల ఊచకోత ఘటనలో నిందితులు అగ్రవర్ణాలవారైనందుకే 23ఏళ్ళు దాటినా వారికి న్యాయం జరుగలేదు. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంపోతుంది. నిందితులు నిర్దోషులైతే మరి దళితులను హత్యచేసింది ఎవరో తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తికే తెలియాలి. ఇప్పటికైనా నిందితులకు శిక్షపడితేనే ఈ దేశంలో దళితులకు, బడుగు, బలహీనవర్గాల వారికి న్యాయం చేకూరుతుందని ప్రజలు భావిస్తారు. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది.