గంగా ప్రక్షాళనకు మీ ప్రణాళిక పనికిరాదు

3 3A

200 ఏళ్లయినా సాధ్యంకాదు

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో రండి

సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (జనంసాక్షి) : గంగా ప్రక్షాళనకు మీ ప్రణాళిక పనికిరాదని కేంద్రానికి సుప్రీంకోర్టు తెలిపింది. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు కేంద్రం ఇచ్చిన ప్రణాళికపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రణాళిక ప్రకారం గంగానది ప్రక్షాళన 200 ఏళ్ల తర్వాత కూడా సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో రావాలని కోరింది. సత్వర కార్యక్రమం చేపట్టేలా నది ప్రక్షాళనకు దశల వారీ ప్రణాళికను రూపొందించాలని, దానికి అంచెలంచెలుగా లక్ష్యాలు నిర్దేశిరచాలని సూచించింది. మూడు వారాల్లోగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తమకు తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. సాధారణ పౌరులకు సైతం అర్థమయ్యేలా ఈ ప్రణాళిక ఉండాలని సూచించింది.

మరణశిక్షలను జీవితఖైదుగా మార్చలేం : ఇదిలా ఉండగా సుదీర్ఘ న్యాయ విచారణ వల్ల ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చిందన్న ప్రాతిపదిక విూద మరణశిక్షను జీవిత ఖైదుకు మార్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీల రివ్యూ పిటిషన్‌ లను కోర్టులు బహిరంగంగా విచారించాలని స్పష్టంచేసింది. అన్ని మరణ శిక్ష కేసుల్లోనూ గరిష్టంగా 30 నిముషాల వరకు పరిమిత మౌఖిక విచారణకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ థర్మాసనం పేర్కొంది. మరణశిక్ష పడిన ఖైదీల అపీళ్లను ఇకపై జడ్జిల ఛాంబర్‌లోనే నిర్ణయించాల్సిన అవసరంలేదని సాధారణ కోర్టులోనూ రివ్యూ పిటిషన్లు విచారించవచ్చునని, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది. తమ పిటిషన్లను సాధారణ కోర్టుల్లోనే విచారించాలని మరణశిక్ష పడిన పలువురు ఖైదీలు వేసిన పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనం విచిరించింది.  వెలువరించిన తీర్పులో మరణశిక్షపడిన ఖైదీల అపీళ్లను ముగ్గురు జడ్జీల బెంచ్‌ విచారించవచ్చునని తేల్చి చెప్పింది. అయితే న్యాయపక్రియ కారణంగా ఎక్కువ కాలం జైల్లోనే గడిపారనే కారణంతో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలనే పిటిషన్‌నర్ల వాదనను తిరస్కరించింది. ఎర్రకోటపై దాడి కేసులో మరణశిక్షపడిన మహ్మద్‌ ఆరీఫ్‌ న్యాయపక్రియలో ఆలస్యం కారణంగా తాను 13ఏళ్ల 6నెలలు జైల్లోనే ఉన్నందున మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరాడు. ఆరీఫ్‌ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మరణశిక్ష పడ్డ ఖైదీలకు సాధారణ కోర్టుల్లో అరగంటసేపు తమ వాదన వినిపించే అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు పిటిషనర్లు లేకుండానే జడ్జీలు తమ ఛాంబర్‌లోనే పిటిషన్లు పరిశీలించి అపీళ్లపై నిర్ణయం తీసుకుంటూ వచ్చారు.