9న ఆర్డీఎస్‌పై ఎమ్మెల్యే సంపత్ దీక్ష
ప్రాజెక్టులను అడ్డుకుంటే ఖబర్దార్ అంటున్న టిఆర్ఎస్
మహబూబ్‌నగర్,మే4(జనంసాక్షి): ఆర్టీఎస్ సమస్యపై ఈ నెల 9న దీక్షకు కాంగ్రెస్ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సిద్దం అవుతున్నారు. ఈనెల 9న ఆర్డీఎస్ సమస్యపై దీక్ష చేపట్టడానికి స్థలపరిశీలన చేశారు. పార్టీ నాయకులతో సవిూక్షించారు. ఇదిలావుంటే రాజోలిబండ వివాదంపై కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు చేసింది. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరులో కర్ణాటక సాగునీటి శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌తో సమావేశమై… రాజోలిబండ వివాదంపై చర్చించారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు నీటిని అందించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదిలావుంటే
అయిజ మండల పరిధిలోని సింధనూరు గ్రామం దగ్గర ఆర్డీఎస్ కాలువలో పూడికతీత పనులను ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రారంభించారు. రూ.1.15కోట్లంతో ప్రభుత్వం పూడికతీత పనులను చేపట్టింది. తెలంగాణ సరిహద్దుప్రాంతమైన సింధనూరు దగ్గర 42.6 కిలోవిూటరు దగ్గర పనులు మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి 104 కిలోవిూటరు పనులు కొనసాగుతాయని వివరించారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా పనులు త్వరగా ముగించాలని ఆయన పేర్కొన్నారు. పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం పొక్లెయిన్‌ను నడిపి పనులు ప్రారంభించారు. అలాగే దీక్షకు సిద్దం అవుతున్నట్లు ప్రకటించారు.
అయితే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్వించారని నిరసన తెలిపారు. జిల్లా రైతులకు అన్యాయం చేసే విధంగా చంద్రబాబు చర్యలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీనిని జీర్ణించుకోలేక ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పార్టీల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉండవద్దని కోరారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదన్నారు. ప్రాజెక్టుల వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు నిద్ర చేసి పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కాని ఇవేవిూ పట్టించుకోకుండా ప్రాజెక్టుల ద్వారా నిద్రపోతే ఎమి వస్తుందని ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడటం సరికాదని అన్నారు. ఆంధ్ర నేతలు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడటం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. దశాబ్దాలుగా ఆంధ్ర నేతలు నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో తెలంగాణకు తీరని
అన్యాయం చేశారన్నారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖరాస్తాననడం, వైఎస్ జగన్ దీక్షలు చేస్తాననడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినందునే తెలంగాణలో టిడిపి అదృశ్యమైందన్నారు. వైకాపానేత జగన్ ప్రతిదానికి దీక్షలు అంటూ చెప్పడం చూస్తే దీక్షలు చేయడంలో గిన్నిస్‌బుక్ రికార్డు సాధిస్తారని ఎద్దేవ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ తధ్యమన్నారు.