ప్రగతిభవన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
పంజాగుట్ట: డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని మనస్తాపం చెందిన దంపతులు ప్రగతిభవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు చెందిన మహేందర్ (40) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం డబుల్ బెడ్‌రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా.. మంజూరైనట్లు ఇటీవల అధికారుల నుంచి ఫోన్ వచ్చింది.
ఆ తర్వాత మహేందర్ ఏ అధికారి వద్దకు వెళ్లినా ఇంటి విషయంపై సరైన సమాధానం చెప్పలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేందర్, తన భార్యతో కలిసి ప్రగతిభవన్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించిన భద్రతా సిబ్బంది వారిని రక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.