కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలోని చందంపేట మండలం యల్మలమంద గ్రామానికి చెందిన మెగావత్ రంగా నాయక్, జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలాన నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కేతావత్ సునిల్ ఐదుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.ట్రాన్స్‌ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా కారులో హైదరాబాద్‌కు తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకునే వారని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాడపల్లి వద్ద ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద నుంచి రూ.9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.