టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ

 

హైదరాబాద్‌: (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేశారు. టీచర్‌ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 పిలువాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్‌-2, 3తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కొక్కరిగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కాగా, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గత తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మోతీలాల్‌నాయక్‌ దీక్ష విరమించారు.