యాద‌గిరిగుట్ట ప్ర‌సాదాల‌పై అప్ర‌మ‌త్తం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను హైదరాబాద్‌లోని ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఈ నెయ్యిలో ఏదైనా కల్తీ జరిగిందా.. అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఈ నెల 30లోపు వస్తుందని ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.కాగా, దేవస్థానంలోని లడ్డూ ప్రసాదాల తయారీలో 40 ఏండ్లుగా నార్మూల్‌ సంస్థకు చెందిన నెయ్యిని వినియోగిస్తున్నారు. నెలకు సుమారు 20 నుంచి 25 వేల కిలోల నెయ్యిని వాడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఒక్కో లడ్డూకు 90 నుంచి 100 గ్రాముల నెయ్యిని వినియోగిస్తున్నారు. దాంతోపాటు లడ్డూ తయారికి కావాల్సిన యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్‌ పొడి, చక్కెర పాకం, బూంది వంటి ముడి సరుకులు సైతం తాజాగా సేకరించి వినియోగిస్తున్నారు. రోజు అనుభవజ్ఞులైన తయారీదారులతో పరీక్షించి మరీ భక్తులకు అందజేస్తున్నారు.యాదగిరిగుట్ట ఆలయం పునఃప్రారంభం తర్వాత ప్రసాదాలు సిద్ధం చేసేందుకు అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.13.8 కోట్లతో భారీ యంత్రాలను చెన్నై, పుణే, హర్యానా, ముంబయి, రాజమండ్రి వంటి ప్రదేశాల నుంచి తీసుకొచ్చి మానవ రహిత లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. బూంది ప్రైయర్‌, షుగర్‌ సీరప్‌ మిషన్స్‌, దాల్‌ పుల్వలైజర్‌, గ్రైండింగ్‌ మిషన్‌, చక్కెర సైలోస్‌ మిషన్‌ వంటి ఆధునాత యంత్రాలలో లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నారు. బోగ్‌ (దేవుడికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) సంస్థ దేవస్థాన ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తపరిచింది. యాదగిరిగుట్టలో ఆరోగ్యకరమైన నాణ్యత ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయని కితాబునిస్తూ గతేడాది మార్చి 28న బోగ్‌ సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సర్టిఫికెట్‌ను పొందిన దేవాలయంగా యాదగిరిగుట్ట క్షేత్రం నిలిచింది.