పిల్లలు అంటే కోడిపిల్లలు కాదు.. అర్థం చేసుకోండి
ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన మరో అటెన్షన్ డైవర్షన్ ఎత్తుగడ.. సమీకృత గురుకులాలు అని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాంగీయులకు విద్య మీద ఏ మాత్రం అవగాహన లేదని ఈ సమీకృత గురుకులాల వ్యవహారం చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.. ఇంత వరకు తెలంగాణ కు విద్యా శాఖ మంత్రి లేడు అని విమర్శించారు.గురుకులాలు అనాది నుంచే సమీకృతం అన్న ఇంగింత జ్ఞానం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. మీరు ఎప్పుడన్నా ఆ జీవోలను చదివారా అని ప్రశ్నించారు. తెలంగాణ గురుకులాలలో ఒక కులం వాళ్ళు మాత్రమే చదువుతారని మీకు చెప్పిన బుర్ర లేని సన్నాసి ఎవరు అని మండిపడ్డారు. అసలు ఎలాంటి చర్చ జరగకుండానే, జీవోలు విడుదల కాకుండానే మీరు ఆదరాబాదరాగా సమీకృత గురుకులాల బిల్డింగ్స్ డిజైన్స్ ను ఫైనల్ చేయడం అంటే ₹5000 కోట్లను మింగేయడానికే నన్న అనుమానం ప్రజలకు కలుగుతోందని అన్నారు. 5వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కట్టలేని మీరు.. వచ్చే మూడు నెలల్లో రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.640 మంది విద్యార్థులను మేనేజ్ చేయడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో 2560 మంది పిల్లలను ఒకటే చోట పెట్టి ఎట్ల చదివిస్తరని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఉండే ఒక గంట లంచ్ టైం లో 2560 మంది పిల్లలు ఒకటే డైనింగ్ హాల్‌లో కూర్చొని ఎట్ల తింటరని అడిగారు. పిల్లలు అంటే కోడిపిల్లలు కాదని.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. 640 మంది పిల్లలకు కేసీఆర్ 7-10 ఎకరాల భూమి కేటాయిస్తే, మీరు 2560 మందికి 25 ఎకరాల భూమిని ఎట్ల కేటాయిస్తరు? దేనికి సరిపోతయి ఈ 25 ఎకరాలు అని ప్రశ్నించారు. 640 మంది పిల్లల రెసిడెన్షియల్ స్కూల్ కట్టే బడ్జెట్ 20 కోట్ల రూపాయలు అయితే, 2560 మంది పిల్లలకు 25 కోట్లు ఎట్ల సరిపోతాయని నిలదీశారు.మీ సమీకృత గురుకులాలు వచ్చినందున ఇక అన్ని గురుకులాల సొసైటీలను రద్దు చేస్తారా అని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. 662 గురుకులాలకు పక్కా భవనాలు లేకపోతే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కట్టించండని అన్నారు. ఊకె కేసీఆర్ మీద ఎందుకు ఏడుస్తరని మండిపడ్డారు. 2014 నుండే గురుకులాలన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో కి మార్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు మీరు కొత్తగా చేసేదేముందని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అంటే మీ సీఎం, మంత్రులు అధికారులు మాత్రమే ఢిల్లీ, లండన్, కొరియా అమెరికా, చివరకు పక్కనే ఉన్న నల్గొండ జిల్లాకు హెలికాప్టర్‌లో వెళ్లడమేనా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌లా వందలాది మంది విద్యార్థులను విమానం ఎక్కించి విదేశాలకు పంపించి చదివించడం ఏమైనా ఉందా అని నిలదీశారు.నిజంగా చిత్తశుద్ధి ఉంటే మెస్ చార్జీలను పెంచాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. టీచర్ల సంఖ్యను పెంచాలని, కౌన్సిలర్లను నియమించాలని, క్రీడా సాంస్కృతిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని, మంచి కోచ్‌లను నియమించాలని, వారికి మొదటి తారీఖునే జీతాలు ఇవ్వాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు. మీ విదేశీ పర్యటనలు తగ్గించి విద్యార్థులను విదేశాల్లో చదివించి వాళ్లను మళ్లీ తెలంగాణకు తీసుకురావాలని సూచించారు.