రేపు జడ్చర్లకు సీఎం రేవంత్ రెడ్డి

సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు

జడ్చర్ల, జూన్ 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీన జడ్చర్ల పట్టణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గంగాపూర్ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సభా వేదిక నిర్మాణం, ప్రజల కొరకు కూర్చునే ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా మరియు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారులతో కలిసి వారు ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి, ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల రాక నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.