మాదకద్రవ్యాల నిర్మూలనకు సామూహిక ప్రతిజ్ఞ

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పిలుపు
మహబూబాబాద్, నవంబర్ 18 (జనం సాక్షి): నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల విక్రయం, కొనుగోలు, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయిలో డ్రగ్ నిరోధకతపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత, సీడీపీఓ శిరీష, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గుగులోత్ దేశీరాం, బీసీ, ఎస్సీ, మైనారిటీ శాఖల అధికారులు బి. శ్రీనివాసరావు, శ్రీనివాస్, మెప్మా అధికారిణి విజయ, అంగన్‌వాడీ టీచర్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్‌తో పాటు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.