కుప్పకూలుతున్న అమెరికా సామ్రాజ్యవాదం

అగ్రరాజ్య ఏకఛత్రాధిపత్యానికి క్రమంగా గండి
మొహం చాటేస్తున్న యూఎస్ మిత్రదేశాలు..
డాలర్‌కు బదులుగా యువాన్‌లో చమురు వ్యాపారం చేసే యోచన
ట్రంప్ యుద్ధ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
హర్మూజ్ జలసంధి విషయంలో ఇప్పటికే భంగపడ్డ అగ్రదేశం
స్వదేశీయుల్లోనే వ్యతిరేకతతో కక్కలేక.. మింగలేని పరిస్థితి
జనంసాక్షి, స్పెషల్ కరస్పాండెంట్, మార్చి 19 :
ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని ఊగిపోయే అగ్రరాజ్యం ఈసారి భారీస్థాయిలో భంగపడ్డది. నిత్య యుద్దోన్మాద చర్యలతో సొంత దేశస్తులతోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్ సర్కార్.. ఇతర దేశాల నుంచీ ఎలాంటి మద్దతు లభించక ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం, భగ్గుమంటున్న ధరలు, ఎగుమతులు దిగమతుల్లో తీవ్ర ఆటంకాలు.. వెరసి వీటన్నింటికీ అమెరికా చర్యలే కారణమని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ టెంపరితనం వల్ల అమెరికా సామ్రాజ్యవాదమూ మసకబారుతోంది.
ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికి దిగారని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. మనస్సాక్షిని చంపుకొని ట్రంప్ చర్యలకు మద్దతు ఇవ్వలేనని పేర్కొన్నాడు. అదేవిధంగా, అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ పాలన చెక్కుచెదరలేదని, కేవలం బలహీనపడిందని అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈ ఇరువురి నిరసన ఇరాన్‌పై ట్రంప్ సర్కారు అనైతిక చర్యలను ప్రతిబింబిస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి 20రోజులు కావొస్తుండగా.. ఈ చర్యలు ఆసియా, ఐరోపా దేశాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ప్రజల్లో కూడా తీవ్ర నిరసన పెరిగింది. ప్యూ రీసెర్చి సెంటర్ సర్వే ప్రకారం, ట్రంప్ ఆమోదం రేటు 37 శాతానికి పడిపోయింది. స్వతంత్ర ఓటర్లలో ట్రంప్ ఆమోదం 25 శాతానికి పడిపోగా, 66 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు, కేవలం 27 శాతం అమెరికన్లు మాత్రమే ట్రంప్ విధానాలను సమర్థిస్తున్నట్టు వెల్లడైంది.
మారనున్న చమురు వ్యాపారం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థలో మార్పులకు దారితీసే సూచనలిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం హర్మూజ్ జలసంధి గుండా జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి బయటపడటానికి ఇరాన్, దాని మిత్రదేశాలు డాలర్‌కు బదులుగా చైనా కరెన్సీ యువాన్‌లో చమురు వ్యాపారం చేయాలనే ఆలోచనకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అంతర్జాతీయ చమురు లావాదేవీలలో ఎక్కువ భాగం డాలర్‌లోనే జరిగింది. అయితే యువాన్ వాడకం పెరిగితే డాలర్‌పై గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధ నౌకలు పంపాలని ట్రంప్ పిలుపునిచ్చినా.. చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ దేశాలు తిరస్కరించడం అమెరికాకు శంగభంగంగా మిగిలింది. ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్ కూడా సైనిక సహాయం నిరాకరించాయి. ఆయిల్ ధరలు 40శాతం మేర పెరగడం, ఆర్థిక వ్యవస్థలు కుదుపునకు గురికావడం వంటి పరిస్థితులకు అమెరికానే బాధ్యత వహించాలని పలు దేశాలు పేర్కొంటున్నాయి.
ఏక్ నిరంజన్‌గా ట్రంప్
ఇరాన్‌ను బూచీగా చూపాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం అమెరికా సామ్రాజ్యవాదానికి తీవ్ర శరాఘాతం. నాటో కూడా ఈ యుద్ధంలో పాల్గొనబోమని తేల్చింది. బాల్టిక్ దేశాలు, పోలాండ్ కొంతవరకు మాట్లాడినా.. బ్రిటన్, జర్మన్, ఫ్రాన్స్, కెనడా, నార్దిక్ దేశాలు స్పష్టంగా వెనుకాడాయి. యూరప్ దేశాలు “లీగల్, ఎథికల్ సమస్యలు” అని చెప్పి దూరంగా ఉన్నాయి. స్పెయిన్, టర్కీ స్పష్టంగా వ్యతిరేకించాయి. ఒకవిధంగా ఈ యుద్ధంతోనే ట్రంప్ రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంలో పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోపలి రాజీనామాలు, బయట అంతర్జాతీయ ఒంటరితనం – ఇది అమెరికా అసలు ముఖంగా కనిపిస్తోంది. చైనా-రష్యా నాయకత్వం, ఆసియా-ఆఫ్రికా దేశాల స్వేచ్ఛా ఆకాంక్షలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని సవాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
డాలర్‌కు భారీ దెబ్బ
ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి డాలర్ బలహీనపడుతోంది. యువాన్ డాలర్‌తో పోలిస్తే బలపడి 6.89 స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాలు డాలర్‌పై ఆధారపడటం తగ్గిస్తున్నాయి. యుద్ధ ఖర్చులు, ఆయిల్ ధరలు, షిప్పింగ్ ఇన్సూరెన్స్ – ఇవన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రోజువారీ జీవితం ఇబ్బందుల్లో పడింది. ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడటంతో వంట గ్యాస్ సమస్య తీవ్రమైంది. యుద్ధ పరిస్థితులు చమురు సరఫరా గొలుసులను దెబ్బతీస్తే.. దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయాలను అన్వేషించే అవకాశం ఉంది. మరోవైపు, చమురు దిగుమతుల కోసం భారత్ యువాన్‌ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తే ఆ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది. విదేశీ మారక నిల్వలలో కూడా డాలర్‌తో పాటు యువాన్ వాటాను పెంచాల్సిన అవసరం రావచ్చు. హార్ముజ్ జలసంధిని తెరవలేకపోవడం, నాటో దళాలు సహకరించకపోవడం, మిత్రదేశాలైన బ్రిటన్-జర్మనీలు వెనుకాడడం, చైనా-రష్యా పరోక్ష సహాయం, డాలర్ పతనం, యువాన్ ఉత్థానం.. ఇవన్నీ కలిసి అమెరికా సామ్రాజ్యవాదానికి ఒక భారీ గుణపాఠమని విశ్లేషకులు భావిస్తున్నారు.


