అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు
భీమారం (జనంసాక్షి బ్రేకింగ్): హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు కాల్చి చంపాడు. కేయూ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, వరంగల్ జిల్లా కీర్తి నగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబ కలహాలతో గత మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, పెద్దపల్లి జిల్లా కోటపల్లి ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్.. తుపాకీని తీసుకుని గుండ్ల సింగారంలోని తన అత్తగారి ఇంటికి ఇవాళ వచ్చాడు. ఈ నేపథ్యంలో అత్త కమలమ్మ(53)కు ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో కమలమ్మను కాల్చి చంపాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి కేయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.