రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ
కోల్‌కతా (జనంసాక్షి) : పశ్చిమ బెంగాల్‌లో కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, దీనికి సమాధానాలు కేంద్రమే ఇస్తుందని ఆమె అన్నారు. అన్ని మతాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, అందరూ శాంతియుతంగా ఉండాలని, మతం పేరుతో విద్వేషాలకు పాల్పడవద్దు అని, ప్రతి ఒక్కరి జీవితం విలువైందని, రాజకీయాల కోసం అల్లర్లు సృష్టించవద్దు అని, హింసను ప్రేరేపించి సమాజానికి హాని చేయవద్దు అని ఆమె తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్‌లోని పలు జిల్లాలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మాల్దా, ముర్షీదాబాద్, సౌత్ 24 ప్రగనాస్, హూగ్లీ జిల్లాల్లో ఈ ఆందోళనలు చేపట్టారు. అనేక వాహనాలు, పోలీసు వ్యాన్లకు నిప్పుపెట్టారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. చట్టాన్ని మనం చేయలేదని, కేంద్రమే ఆ చట్టం చేసిందని, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సమాధానాన్ని రాబట్టాలని ఆమె అన్నారు.