జలదిగ్భందంలో ఏడుపాయల ఆలయం
మెదక్ జిల్లా ఏడుపాయలలో ఉన్న వన దుర్గామాత ఆలయం రెండో రోజూ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో గర్భ గుడిలోకి వరద చేరింది. ఆలయం ఎదుట మంజీరా ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో కురిసిన భారీ వర్షాలతో 12 రోజుల పాటు ఏడుపాయల ఆలయం మూతపడింది.మరో వైపు సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 10,431 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 11,461 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.76 టీఎంసీలుగా ఉంది.