హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
నల్గొండ బ్యూరో,(జనంసాక్షి): హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు హనుమాన్ శోభాయాత్ర లో ప్రజలకు ఎలాంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా,సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలన్నారు.శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చేయరాదని, మత సామరస్యంతో సోదరభావంతో ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు,తప్పుడు ప్రచారాలను పోస్టు చేస్తూ వివాదాలకు దారి తీసే విధంగా పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఎలాంటి తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహకులు బాధ్యతగా,శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ పోలీసు వారి సూచనలూ పాటించి సహకరించాలన్నారు.డీజే లకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ. నల్గొండ జిల్లా పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డీజే లతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధించడం జరిగిందని అన్నారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం,మానసి ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించడం జరిగిందని,ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించ రాదని పేర్కొన్నారు.