ఇరవెండిలో ఆరోగ్యంపై అవగాహన.

– వడదెబ్బ నివారణకు సూచనలు…

బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామం పల్లె దవాఖానాలో గ్రామ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహారం, అసాంఘిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుండి బాబురావు ముఖ్య అతిథిగా హాజరై వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సమయంలో ఓఆర్ఎస్ వినియోగం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించారు. అసాంఘిక వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి అంటుకోవని, బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి మానసిక ధైర్యం ఇవ్వాలని అవగాహన కల్పించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్‌పీ జ్యోతి, ఏఎన్‌ఎం సుందర వేణి, ఆశా వర్కర్లు, మొదటి వార్డు సభ్యురాలు కేలోత్ దుర్గ, గ్రామస్తులు పాల్గొన్నారు.