మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు
భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా
భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో సోమవారం ప్రత్యేక ఆరోగ్య శిబిరం జరిగింది.వంగర వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో కొంత మంది గ్రామస్థులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా వంగర వైద్యాధికారి డాక్టర్ రూబీనా మాట్లాడుతూ, వర్షాకాలం రాగానే సీజనల్ వ్యాధులు విస్తరించే ప్రమాదం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా జ్వరం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో చెత్త పేరుకుపోవడం,నిల్వ నీరు ఉండడం వంటి కారణాల వల్ల దోమల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
ఈ శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా జ్వర పరీక్షలు,ఆర్‌డీటీ, సీబీపీ,డెంగ్యూ, మలేరియా,చికెన్ గునియా పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు మందులు అందజేయడమే కాకుండా,కొంతమందికి ఇంజెక్షన్లు, ఐవీ ఎఫ్ చికిత్సలు అందించారు.
ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలనిఅనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయవద్దని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పరిశుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, తాగునీటిని మరిగించి వాడుకోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని గ్రామస్థులను కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రహమాన్, డాక్టర్ రూబీనా, డాక్టర్ దినేష్, సూపర్‌వైజర్ వాణి, ఏఎన్‌ఎమ్ రఫత్ పాల్గొని గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు.