నానో ఉత్పత్తుల వినియోగంతో అధిక దిగుబడులు   ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ రాజినీష్ పాండే 

హత్నూర: సెప్టెంబర్ 22 (జనం సాక్షి)
రైతుల సహకార సంస్థ ఇఫ్కో వారి నానో ఉత్పత్తులను పంట సాగుకు వినియోగించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఇఫ్కో మార్కెటింగ్ సర్వీస్ చీఫ్ మేనేజర్ రాజినీష్ అన్నారు.మండలంలోని కాసాల శివారులో గల ఇఫ్కో బజార్ దుకాణ సముదాయం వద్ద ఆదివారం నానో ఉత్పత్తులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నదే తమ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని వారు పేర్కొన్నారు.దౌల్తాబాద్ క్లస్టర్ ను నానో మోడల్ విలేజ్ గా తీసుకోవడం జరిగిందన్నారు.నానో యూరియా, డిఎపి పైన 25శాతం సబ్సిడీ లభిస్తుందని వారు తెలిపారు.నానో ఉత్పత్తుల వాడకంతో భూమిలో ఖనిజ లవణాలు,పోషక విలువలు పెరిగి ఎలాంటి‌ చీడపీడలకు గురికాకుండా ఆరోగ్యకరమైన పంటలు పండే ఆస్కారముంటుందని వారు చెప్పారు.జిల్లాలో ఇప్పటికే ఎరువులను పిచికారి చేయడం కోసం సంగారెడ్డి, జహీరాబాద్,నారాయణ‌ఖేడ్,పటాన్ చెరు‌‌ మండలాల్లో  డ్రోన్లను అందించడం జరిగిందని వారన్నారు.సాధారణ ఎరువుల కన్న నానో ఎరువుల ధరలు తక్కువగా ఉంటాయని అన్నారు.కార్యక్రమంలో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్, అసిస్టెంట్ మేనేజర్ చంద్రన్న, రీజినల్ మేనేజర్ పున్నం రాజు, సీనియర్ మేనేజర్ మహేందర్,సేల్స్ ఆఫీసర్ రాజేష్,రైతులు తదితరులు పాల్గొన్నారు.