​గీతకార్మికుల పెన్షన్లకు తిరకాసులు..!

– ఏజెన్సీ చట్టాలతో గీత కార్మికులకు హరిగోసలు…

– ఎంపీడీవోకు దరఖాస్తు ఫారాలను అందజేసిన గీత కార్మికులు…

మంగపేట, ఆగస్టు 24(జనంసాక్షి) మంగపేట ​మండలంలో అన్ని వర్గాలకూ అందుతున్న సంక్షేమ ఫలాలు గీత కార్మికులకు మాత్రం అందని ద్రాక్షలా మారుతున్నాయి. గీత కార్మిక కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అర్హులకు సైతం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతుండటం పట్ల గౌడన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగపేట మండలంలో నివసించే గీత కార్మికులు అర్హులైనప్పటికీ, వారి వద్ద గీత కార్మిక సొసైటీ రిజిస్ట్రేషన్ గుర్తింపు నెంబర్ ఉండాలంటూ అధికారులు చెబుతున్నట్లు కార్మికులు వాపోతున్నారు. గతంలో ఇక్కడ సొసైటీ ఉన్నప్పటికీ, ఈ ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతంగా ప్రకటిస్తూ 2001లో దాన్ని రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సొసైటీ పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వృత్తిరీత్యా ఎటువంటి ప్రమాదాలు జరిగినా ప్రభుత్వపరంగా రావాల్సిన ఎక్స్గ్రేషియా, ఇతర సంక్షేమ పథకాలు అందక అనేక కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్నాయి అంటూ గీత కార్మికులు ఆవేదన వ్యక్తపరిచారు. గీత కార్మిక పెన్షన్ల కొరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు తమ గోడును వెళ్లగక్కారు. అలాగే ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఇతరత్రా కులాల వారికి ఏ విధంగా పెన్షన్లను మంజూరు చేస్తున్నారని కేవలం గీత కార్మికులనే సొసైటీల పేరుతో తిరస్కరించడం సరైనది కాదని ఈ ప్రాంతంలో నివసిస్తున్న మాకు వర్తించిన చట్టాలు ఇతరత్రా కులాలకు ఎలా వర్తిస్తున్నాయి అంటూ అధికారులను గీత కార్మికులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఏజెన్సీ చట్టాల మినహాయింపులతో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తాము గీత వృత్తిని నమ్ముకుని బతుకుతున్న గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి గీత కార్మికుల సొసైటీ రిజిస్ట్రేషన్ నిబంధనను సడలించి, అర్హులైన ప్రతి గీత కార్మికుడికి పింఛను మంజూరు చేయాలని గౌడ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ​ఈ సమస్యపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లోని గీత కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి న్యాయం చేయాలని గీత కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గాజుల ఈశ్వర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు బొంబోతుల సత్యం, వడ్డారపు లక్ష్మీనారాయణ, గాజుల పవన్ కుమార్, గంట రాజు, బూర నరసింహారావు, పులి ప్రభాకర్, గౌని రమేష్ తదితరులు పాల్గొన్నారు.