సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం

కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువు సమీపంలో ఉన్న నివాసులకు హైడ్రా గుబులు పుట్టిస్తున్నది. చెరువు పరిధిలోని ఇండ్లు కూల్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు సద్దుల చెరువు ప్రాంతంలో ఇండ్ల వివరాలు తెలుసుకునేందుకు వచ్చారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదురైంది. ‘ఏం మార్కింగ్‌ వేస్తుండ్రు.. కండ్లల్లో కారం పోసి కొడుతం.. ఒక్కో ఇంట్లో నాలుగు నాలుగు కుటుంబాలున్నాయి. రోడ్డు మీద బతకాలా? మేమొచ్చి 40 ఏండ్లు దాటింది.. మా ఇండ్లకు పట్టాలు కూడా ఉన్నాయి. అప్పుడు చెరువే లేదు. నాయకులు గేమ్‌లు ఆడుతూ జనాలను పిచ్చోళ్లను చేస్తుండ్రు. మీరు.. జేసీబీ తెచ్చి ఈడ పెట్టుండ్రి.. ఒక్కొక్క నా కొడుకును నరకకుంటే అడుగు.. కడుపుల మండుతుంది.. ’ అని అక్కడి జనం ఆగ్రహ వ్యక్తంచేశారు. ఇలా తిట్లు, శాపనార్థాలు పెట్టడంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగిపోయారు. సూర్యాపేట ఆర్డీవో ఆదేశాల మేరకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న ఇండ్లను సర్వే చేసేందుకు సద్దుల చెరువు సమీపంలోని నెహ్రూనగర్‌కు వచ్చినట్టు ఇరిగేషన్‌ ఏఈ భూక్యా పాండునాయక్‌ తెలిపారు.