మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం నా నైజం కాదు : బున్నె రవి

నిజామాబాద్/మోపాల్, డిసెంబర్ 5 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఊరి ప్రజలందరిపై నమ్మకంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని, సుదీర్ఘ అనుభవాన్ని, ఊరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తనను ఆదరించాలని కంజర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బున్నె రవి విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్న వారికి తోడుగా నిలిచి, వాటన్నింటినీ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అవసరమైతే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మండల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ఊరి ప్రగతి కోసం పాటుపడతానని చెప్పారు. అలవిమాలిన హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకునే వ్యక్తిత్వం తనది కాదన్నారు. చేసేది చెప్పి దాన్ని చేసి చూపిస్తానని, తన పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ పరిష్కారం దిశగా చొరవ తీసుకుంటానని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరి కష్టసుఖాల్లో భాగమై ఊరి పురోగతికి శ్రమిస్తానని, జిల్లా స్థాయిలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలకు సేవకుడిలా ఉంటానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామర్తి నర్సారెడ్డి, అంగల సాయరెడ్డి, సర్కల భూమన్న, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.



