ఈ సమయంలో ఇరు దేశాలు సంయమనం పాటిస్తే బెటర్: ఐక్యరాజ్యసమితి
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే. పర్యాటకులపై ముష్కరులు తూటాల వర్షం కురిపించడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ భీకర దాడిని ఐక్యరాజ్యసమితి కూడా ఖండించింది. ఈ ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన… ఈ సమయంలో పాక్, భారత్ సంయమనం పాటించాలని సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడిన స్టీఫెన్ డుజారిక్… “జమ్మూలో టూరిస్టులపై జరిగిన పాశవిక ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండిస్తోంది. పౌరులపై దాడి అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్, పాక్ సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇరుదేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం” అని ఆయన తెలిపారు. ఇక, ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందంటూ ఆరోపించిన భారత్… సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై స్టీఫెన్ డుజారిక్ ను విలేకరులు ప్రశ్నించారు. ఈ ఉద్రిక్తతల వేళ నిబంధనలపై రెండు దేశాలు సంయమనం పాటించి, పరిస్థితులు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.