ముగిసిన జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గ గడువు , ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోకి జడ్చర్ల పురపాలక సంఘం
జడ్చర్ల, మే 7 (జనంసాక్షి): ప్రజా స్వామ్యంలో పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసే సేవ మాత్రమే చిరస్థాయిగా నిలుస్తుందని జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం గడువు ముగింపు మరోసారి గుర్తు చేస్తోంది. మే 6వ తేదీతో పాలకవర్గ ఐదేళ్ల గడువు ముగియడంతో, మున్సిపల్ పరిపాలనలో ఒక అధ్యాయం పూర్తయింది. నేటి నుంచి పురపాలక పగ్గాలు ప్రత్యేకాధికారి చేతుల్లోకి వెళ్లనున్నాయి.
అధికారం నుంచి సేవకుడిగా:గత ఐదేళ్ల కాలంలో కౌన్సిలర్లుగా, చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన నాయకులు, నాయకురాలు ఇప్పుడు సామాన్య పౌరుల చెంతకు చేరారు. వార్డుల అభివృద్ధి కోసం చేసిన పోరాటాలు, కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన చర్చలు, ప్రజల కోసం పడిన తపన.. అన్నీ ఇప్పుడు ప్రజల విశ్లేషణకు సిద్ధంగా ఉన్నాయి. పదవి ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంతవరకు పనిచేశామన్నదే ఇప్పుడు ప్రతి నాయకుడి ముందున్న అసలు ప్రశ్న.
సందేశాత్మక మలుపు:పాలకవర్గ గడువు ముగియడం అంటే కేవలం పదవీ విరమణ కాదు, అది తదుపరి ప్రయాణానికి పునాది. నాయకులకులు పదవిలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ప్రజల మెప్పు పొందగలిగామా? అనే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. అలాగే గడిచిన ఐదేళ్లలో తమ వార్డులో జరిగిన మార్పులను గమనించి, భవిష్యత్తులో ఎటువంటి నాయకత్వం కావాలని ఆలోచించాల్సిన బాధ్యత ఓటరుపై ఉంది.పాలన ఇక ‘ప్రత్యేకం: ప్రజాప్రతినిధులు లేని లోటు కనిపిస్తున్నప్పటికీ, పరిపాలనలో జాప్యం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించనుంది. పట్టణ పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజాప్రతినిధులు లేని సమయంలో అధికారులు ప్రజలకు మరింత అందుబాటులో ఉండి, సమస్యలను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కుర్చీలు మారవచ్చు, పాలకులు మారవచ్చు.. కానీ జడ్చర్ల అభివృద్ధి నిరంతరం కొనసాగాలి. నేటి గడువు ముగింపు, రేపటి కొత్త ఆశలకు నాంది కావాలని ఆకాంక్షిద్దాం…



