శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం

మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జూలై 17 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంను ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం రథయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీశ్రీ జగన్నాథ మందిరం, ఇస్కాన్ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో, జడ్చర్ల ధార్మిక సంఘాల సహకారంతో జూలై 18 శనివారం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కావేరమ్మపేటలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం వద్ద ఈ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుండి సిగ్నల్ గడ్డ, మార్కెట్ యార్డ్ 2వ గేట్, నేతాజీ చౌరస్తా, మీదుగా సాగి, రాత్రి 7 గంటలకు రామాలయం (రాజస్థాన్ ఫంక్షన్ హాల్) వద్ద రథయాత్ర ముగుస్తుంది. భక్తులకు భోజన ప్రసాద వితరణ ఉంటుందని, జగన్నాథ, బలభద్ర, సుభద్ర మహారాణి మరియు సుదర్శనుల దివ్య రథయాత్రలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కర్పూర హారతి, పుష్పాలు, జలంతో స్వాగతించి జగన్నాథ స్వామి వారి దివ్య దర్శనం పొందాలని, రథాన్ని లాగి భగవంతుని కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.



