“పర్యావరణాన్ని పరిరక్షిద్దాం – సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దాం.” – ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య

సత్యశోధక్ పాఠశాలలో పర్యావరణ – పరిరక్షణ ప్రతిజ్ఞ                                                         సిరికొండ జులై 18( జనం సాక్షి )నేడు సత్యశోధక్ పాఠశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతిని పరిరక్షించడం, నీరు, విద్యుత్ వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలను నాటి సంరక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. నర్సయ్య మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. చిన్న చిన్న అలవాట్లలో మార్పు తీసుకురావడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని, నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులని, పర్యావరణాన్ని పరిరక్షించి, భావితరాలకు సుస్థిర భవిష్యత్తును నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ నేటి నుంచే పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ పట్ల తమ అంకితభావాన్ని చాటిచెప్పారు.

తాజావార్తలు