పెద్ద శబ్దం.. అంతా భయానకం
ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటనతో ఉలిక్కిపడ్డ ఏలూరుఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడేసంఘటన స్థలం వద్ద గుమికూడిన జనంఏలూరులో ఉల్లిపాయ బాంబుల విస్ఫోటనం తర్వాత అక్కడి పరిస్థితి భయానకంగా తయారైంది.ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్, వెనుక కూర్చున్న సాయిరామ్ పేలుడు సంభవించగానే ఎగిరి రోడ్డుపై పడ్డారు. సుధాకర్ మొండెం నుంచి రెండు కాళ్లూ వేరై ఒక కాలు రెండంతస్తుల డాబా పైనా, మరో కాలు రోడ్డు పక్కన గోడ అవతల పడింది. సాయిరామ్ తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. దట్టంగా పొగ కమ్ముకుంది. అప్పటివరకు కూడలిలో ఉన్నవారు హాహాకారాలు చేస్తూ భయంతో తలో దిక్కుకు పరుగులు తీశారు. తొలుత ఎవరో బాంబులతో దాడి చేశారని.. ఓ వ్యక్తి ముక్కలు ముక్కలయ్యాడని ప్రచారం జరిగింది. తరువాత ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటన గురించి తెలిసింది.బాంబు విస్ఫోటనం ఘటన నేపథ్యంలో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తొలుత బాంబు దాడి ప్రచారంతో ఆ దిశగా అప్రమత్తమయ్యారు. తర్వాత దీపావళి బాంబులని తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సర్వజన ఆసుపత్రికి, సుధాకర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పేలుడు సంభవించినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ఆ పరిసర ప్రాంతాలకు చెందిన పెద్దిరాజు, ఎస్‌కే ఖాదర్, గోపిశెట్టి సురేష్, ఎస్.సత్యనారాయణ, శ్రీనివాస్, సతీష్, పఠాన్‌లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు, పెద్దిరాజుకు తీవ్ర గాయాలు కావడంతో ఆశ్రం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ పరామర్శించారు. ఘటన గురించి తెలుసుకున్నారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు
ఉల్లిపాయ బాంబులను ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఉల్లిపాయ బాంబులని చెబుతున్నా ఘటనా స్థలంలో పరిశీలిస్తే వాటి పరిమాణం పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అవి పేలినప్పుడు అందులో నుంచి చిప్స్ కూడా వచ్చాయి. దీనిని బట్టి అనధికారికంగా తయారు చేసినట్లు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలు ఎక్కువ మోతాదు పెట్టడం వల్లే ఇంత భారీ విస్ఫోటనం జరిగిందని అనుకుంటున్నారు. అధికారికంగా లైసెన్సు ఉన్న కేంద్రాల్లో ఇలా తయారుచేయరని నిపుణులు చెబుతున్నారు. ఏలూరు కేంద్రంగా కొంత కాలం నుంచి అనధికారిక టపాసుల తయారీకేంద్రాలు నడుపుతున్నట్లు తెలిసింది. వన్‌టౌన్లోని కైకలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గుట్టుగా తయారు చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. వీరు అక్కడే కొనుగోలుచేసి అమ్మేందుకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సుధాకర్‌కు వివాహమై ఇంకా సంవత్సరం కాలేదని, ప్రస్తుతం అతని భార్య గర్భవతి అని చెబుతున్నారు. అతని కుటుంబం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. ఇతను నగరపాలక సంస్థలో పొరుగుసేవల ఉద్యోగిగా బోరు ఆపరేటరుగా పని చేస్తున్నారు.