ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన సుధీర్ఘ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో సేవలు అందించారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆయన నివాసంలోనే పురుడు పోసుకుందన్నారు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ మహనీయుడిని సమున్నతంగా గౌరవించిందని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహం ఏర్పాటు చేసింది, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టిందని గుర్తుచేశారు. తెలంగాణ పోరాటంలో, తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన స్ఫూర్తి ఇమిడివుందన్నారు.