మెట్రో సాధనకు ఉద్యమం

మెట్రో రైలు కారిడార్‌ను సాధించడమే లక్ష్యంగా మేడ్చల్‌ మెట్రో సాధన సమితి కార్యాచరణ సిద్ధం చేసింది. జనమే లేని, భవిష్యత్‌లో వస్తుందో రాదో తెలియని ఫ్యూచర్‌ సిటీ (ఫోర్త్‌ సిటీ) కోసం 40 కి.మీ మెట్రో మార్గాన్ని రెండో దశ మెట్రో ప్రాజెక్టులో చేర్చారు. అయితే లక్షలాది మంది నివాసముంటున్న ఉత్తర హైదరాబాద్‌ వైపు మెట్రో మార్గం నిర్మించకపోవడంపై మేడ్చల్‌ మెట్రో సాధన సమితి ఉద్యమానికి తెరలేపింది.ఈనెల 6న సుచిత్ర ప్రాంతంలో మహాధర్నాకు పిలుపునిచ్చింది. ప్యారడైజ్‌ నుంచి నాగ్‌పూర్‌ జాతీయ రహదారి మీదుగా మేడ్చల్‌ వరకు, సికింద్రాబాద్‌ ప్యాట్నీ నుంచి అల్వాల్‌, తూంకుంట మీదుగా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు మెట్రో రైలు కారిడార్లను ఏర్పాటు చేస్తామని గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి, సర్వే పనులు చేపట్టింది.అయితే కాంగ్రెస్‌ సర్కారు ఆ ప్రతిపాదించిన మెట్రో మార్గాలను రద్దు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి తాను అనుకున్న ప్రాంతాలకే కొత్తగా మెట్రో కారిడార్లను ప్రతిపాదించడంతో పాటు వాటికే డీపీఆర్‌లను రూపొందించేలా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఉత్తర హైదరాబాద్‌ ప్రాంత వాసులు ఏకమై మేడ్చల్‌ మెట్రో సాధన సమితిగా ఏర్పాటై ‘మా ప్రాంతాలకు మెట్రో కావాలం’టూ డిమాండ్‌ చేస్తున్నారు.ఉత్తర హైదరాబాద్‌ను విస్మరించారు‘నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతాలను విస్మరించడం ఆమోదయోగ్యం కాదు’ అని మేడ్చల్‌ మెట్రో సాధన సమితి సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఉత్తర హైదరాబాద్‌ వైపు ఉన్న నాగ్‌పూర్‌ జాతీయ రహదారి, హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై ప్రతిపాదించిన మెట్రో మార్గాలను రెండోదశ ప్రాజెక్టులోనే చేర్చాలంటూ కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ సైతం డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిని కలిసి మెట్రో మార్గం ఏర్పాటుపై చర్చించారు.