నేటి నుండి గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ

చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి):
30 గ్రామాల సర్పంచులు, 258 వార్డు స్థానాలకు నామినేషన్లు…
చెన్నారావుపేట మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో వెంకట శివానంద్…
గ్రామాలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను నేడు బుధవారం నుండి 5వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు చెన్నారావుపేట మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో వెంకట శివానంద్ తెలిపారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 30 గ్రామాలలో రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా మూడో విడత సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు తెలిపారు. 30 గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు, 258 వార్డుల స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికలలో అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి 10 క్లస్టర్ గ్రామాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నారావుపేటలో చెన్నారావుపేట, జోజిపేట నారాయణ తండా, అక్కల్ చెడ గ్రామాలు, ఖాదర్ పేటలో ఖాదర్ పేట, తిమ్మరాయిని పహాడ్, గొల్లపల్లె గ్రామాలు, అమీనాబాద్ లో అమీనాబాద్, పత్తి నాయక్ తండ, సూర్యాపేట తండా, గొల్లభామ తండా గ్రామాలు, జల్లిలో జల్లి, శంకరం తండా, బాపునగర్ గ్రామాలు, లింగగిరిలో లింగగిరి, తోపనగడ్డ తండా, కందిగడ్డ తండా గ్రామాలు, భోజేరువులో బోజేరువు, పుల్లయ్యబోడు తండా గ్రామాలు, పాపయ్య పేటలో పాపయ్యపేట, అమృతండా, ధర్మ తండా గ్రామాలు, ఉప్పరపల్లిలో ఉప్పరపల్లి, జీడిగడ్డ తండా గ్రామాలు, కోనాపురంలో కోనాపురం, కాల్ నాయక్ తండ, లింగాపురం గ్రామాలు, ఎల్లయ్యగూడెంలో ఎల్లయ్యగూడెం, బోడ మాణిక్యం తండా, చెరువుకొమ్ము తండా, 16 చింతల తండా గ్రామాల అభ్యర్థులు నామినేషన్లను వేయాలన్నారు. నేడు బుధవారం నుండి 5వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. 6వ తేదీన స్క్రూటినింగ్, 9వ తేదీన విత్ డ్రా, పోటీ చేసే అభ్యర్థుల పబ్లికేషన్, గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. 17వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికలు(పోలింగ్) జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని సూచించారు.



