నర్సింగ్ విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):నర్సింగ్ విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన లాంప్ లైటింగ్, ఓత్ సెరిమనీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి అనేది సేవాభావానికి ప్రతీక అని, రోగులకు సేవ చేయడం దేవునికి సేవ చేసినంత గొప్పదని అన్నారు. సమాజంలో వైద్య సేవలందించే నర్సుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో విద్యను అభ్యసించి మంచి నర్సులుగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు తమ వృత్తిలో మానవత్వం, సహనం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. లాంప్ లైటింగ్ కార్యక్రమం విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఇది సేవా మార్గంలో అడుగుపెట్టే పవిత్రమైనదిగా నిలుస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులు నర్సింగ్ వృత్తికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందచేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేజయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని రంగారావుపల్లిలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ దేవాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.



