పాలస్తీనా స్వతంత్య్ర దేశంగా ఉండాల్సిందే…
పాలస్తీనాపై మా విధానంపై భారత్ కీలక వ్యాఖ్యలు
ఢల్లీి: ఇజ్రాయెల్ – హమాస్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపింది.
ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం పాలస్తీనాపై భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ‘’ఇజ్రాయెల్ – పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉంది. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది’’అని బాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్, గాజాలో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ.. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలన్నారు. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు .. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ ను ప్రకటించింది.