హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన

Protest by journalists in Hyderabad
హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్ : మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు యూనియన్ల భాగస్వామ్యంతో బషీర్‌బాగ్ టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తే ఎమర్జెన్సీ నాటి దుష్ఫలితాలను ప్రభుత్వాలు ఎలా అనుభవించాయో గుర్తుంచుకోవాలన్నారు. న్యూస్ క్లిక్‌పై దాడులు, జర్నలిస్టుల ఇండ్లల్లో తనిఖీలు చేసి నిర్బంధించడం సరికాదన్నారు. ఈ దాడులను ప్రజాస్వామికవాదులు ఖండించాలని, ప్రశ్నించే గొంతుకలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ ప్రదర్శనలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళీ, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, పద్మజషా, ఖాసీం, సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు, సియాసత్ సంపాదకులు అమీర్ అలీ ఖాన్, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, వీక్షణం వేణు, పాశం యాదగిరి, తోట భవనారాయణ, రహ్మాన్, ప్రముఖ రచయిత, గాయకులు జయరాజ్, సామాజిక నిపుణులు రమా మేల్కొటే, సజయ, ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యురాలు సంధ్య, ఓ.పి.డి.ఆర్ బాధ్యురాలు జయ వింధ్యాల, ఎన్.డబ్ల్యూ.ఎం.ఐ బాధ్యురాలు వనజ, సామాజిక కార్యకర్త జస్విన్ జైరత్, మానవ హక్కుల వేదిక బాధ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ నాయకులు ఎం.ఏ.మాజీద్, కల్లూరి సత్యనారాయణ, డి.కృష్ణారెడ్డి, హెచ్.యూ.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, బి.కిరణ్, మల్లయ్య, యం.వెంకట్ రెడ్డి, చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జి.బాల్ రాజ్, న్యూడెమోక్రసీ బాధ్యుడు గోవర్ధన్ పాల్గొన్నారు.