పార్లమెంట్‌లో రైతు సంఘాల నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇవాళ (బుధవారం) పార్లమెంట్‌లో రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 12 మంది సభ్యులతో కూడిన రైతు నేతల బృందం పార్లమెంటు భవనంలోని రాహుల్ గాంధీ కార్యాలయానికి వెళ్లింది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీని రైతులు కోరారని తెలుస్తోంది.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇస్తామంటూ తాము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కనీస మద్దతు ధరను అమలు చేయవచ్చునని తాము లెక్కగట్టామని, అందుకే మేనిఫెస్టోలో పెట్టామని రైతులకు వివరించారు. తాము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కనీస మద్దతు ధర అమలుపై ఇండియా కూటమి పార్టీల నేతలతో చర్చిస్తామని రైతులకు రాహుల్ చెప్పారు. అన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని తెలిపారు. దేశంలోని రైతుల అందరికీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను చట్టబద్ధంగా అందించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.

మరోవైపు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు నాయకులు దేశవ్యాప్తంగా మరోసారి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఖరారు చేశారు. ఈ మేరకు నిరసనలకు సంబంధించిన ప్రణాళికలను రైతు సంఘాలు ప్రకటించాయి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.