జనగణన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి: ఎంపిడిఓ విజయ్ కుమార్

జడ్చర్ల, మే 10 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన – 2027 ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని జడ్చర్ల ఎంపిడిఓ విజయ్ కుమార్ ఆదివారం పత్రిక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ప్రకారం https://se.census.gov.in/ అనే వెబ్‌సైట్ లింక్ ద్వారా ప్రజలు తమ ఇంట్లోనే ఉండి వివరాలను సమర్పించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి రేపే చివరి రోజు అని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ నమోదుతో చేకూరే ప్రయోజనాలు:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ నమోదు ద్వారా ప్రజలకు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ముందుగానే వివరాలు నమోదు చేసుకుంటే ఎన్యుమరేటర్ (గణనకర్త) ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదని వివరించారు. మన వివరాలను మనమే నమోదు చేసుకోవడం వల్ల సమాచారం ఖచ్చితంగా ఉంటుందని, తప్పులు దొర్లే అవకాశం ఉండదని తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా వివరాల నమోదు సులభం మాత్రమే కాకుండా పూర్తిగా సురక్షితమైనదని భరోసా ఇచ్చారు.

సంక్షేమ పథకాలకు కీలకం:కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదైతేనే భవిష్యత్తులో అందే ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో అందుతాయని, ప్రజలు అందించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని, బాధ్యతాయుత పౌరులుగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.