సగం చేపపిల్లలకు సర్కారు కోత

ఉచిత చేపపిల్లల పంపిణీలో ప్రభుత్వం కోత పెట్టింది. సగానికి సగం కోత పెట్టిన ప్రభుత్వం 50శాతం చేపపిల్లల్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. తొలుత 85 కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రణాళికలు రూపొందించిన మత్స్యశాఖ.. టెండర్ల సమయానికి 40 కోట్లకే పరిమితం చేసింది. చేపపిల్లల పంపిణీలో కోతకు ప్రభుత్వం తగినన్ని నిధులు ఇవ్వకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నిధులతో 40కోట్లు పంపిణీ చేస్తామని, ప్రభుత్వం నిధులిస్తే మిగిలిన సగం పంపిణీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతియేట 80 కోట్ల చేపల పిల్లల్ని, మరో 10 కోట్ల రొయ్య పిల్లల్ని పంపిణీ చేసేంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదే చేపపిల్లల పంపిణీకి కోత పెట్టడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగుసార్లు టెండర్లు పిలిచినా…
ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ ఆపసోపాలుపడుతున్నది. జూలై 9నుంచి నేటి వరకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. రెండున్నర నెలల్లో నాలుగుసార్లు టెండర్లు పిలిచినా పంపిణీదారుల నుంచి స్పందన కరువైంది. గతేడాది బకాయిలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడంతో పంపిణీదారులు ముందుకు రావడం లేదు. పాత బకాయిలు ఇస్తేనే టెండర్లలో పాల్గొంటామని పంపిణీదారులు చెబుతున్నారు. తొలుత పిలిచిన టెండర్‌లో ఒకే ఒక దరఖాస్తురాగా, రెండోసారికి 4దరఖాస్తులు వచ్చాయి. మూడోసారి 27వరకు దరఖాస్తులు వచ్చినట్టుగా తెలిసింది. ఇందులో కొంతమందికి వెరిఫికేషన్‌లో చేపల చెరువులు లేకపోవడంతో వారిని తిరస్కరించారు. ఇప్పుడు 19 జిల్లాలకు దరఖాస్తులు ఓకే కాగా 12 జిల్లాలకు మళ్లీ దరఖాస్తులు పిలిచారు. వీటి ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది.

బ్లాక్‌లిస్టులో పెడుతాం
చేపల పంపిణీ రైతులపై మత్స్యశాఖలోని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పంపిణీదారు రైతులను పిలిపించిన అధికారులు.. వారం పది రోజుల్లో బకాయిలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి టెండర్లలో పాల్గొనాల్సిందిగా కోరినట్టు ఓ పంపిణీదారు తెలిపారు. అధికారుల హామీతో టెండర్లలో పాల్గొన్నామని, పదిహేను రోజులు గడిచినా బకాయిల ఊసెత్తడంలేదని తెలిపారు. దీనిపై అధికారులను ఆరా తీస్తే.. బకాయిలు ఇచ్చే పరిస్థితిలేదని, టెండర్‌లో ఎంపికైన వాళ్లు అగ్రిమెంట్‌ చేసుకోవాలని ఆదేశించినట్టుగా తెలిసింది. రైతులు అగ్రిమెంట్‌కు నిరాకరించగా ‘మీ బకాయిలు ఎలా వస్తాయో చూస్తాం. మీ డిపాజిట్‌ డబ్బులను బ్లాక్‌ చేస్తాం. మళ్లీ టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌లిస్టులో పెడతాం’ అంటూ బెదిరించినట్టుగా ఓ పంపిణీదారు ఆవేదనను వ్యక్తం చేశారు.

పంపిణీ ఇంకెప్పుడు ?
ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభంకావాల్సిన చేపల పంపిణీ ప్రక్రియ సెప్టెంబర్‌ పూర్తవుతున్నా టెండర్‌ దశలోనే ఉంది. పంపిణీ ఆలస్యమవుతుండడంతో ఏప్రిల్‌ వరకు చెరవులు, కుంటల్లో నీళ్లు తగ్గి చేపలు ఆశించిన స్థాయిలో పెరుగవని మత్య్సకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నాలుగైదేండ్లుగా పుష్కలమైన చేపలను విక్రయించి ఆర్థికంగా భరోసా దక్కిందని, ఇప్పుడు పంపిణీ ఆలస్యం అవుతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా 50శాతం పంపిణీ నిర్ణయాన్ని విరమించుకొని 100శాతం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాజావార్తలు