ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూళ్లు వేగవంతం చెయ్యండి

భూదాన్ పోచంపల్లి  (జనంసాక్షి): పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్ వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ డి. అంజన్ రెడ్డి వార్డు అధికారులతో పాటు బిల్ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 కు సంబంధించి ఇంటి పన్నుల మొత్తం రూ. 2 కోట్లు 76 లక్షల 9 వేల రూపాయల డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు రూ. 64 లక్షల 55 వేల ను వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇంకా రూ. 2 కోట్లు 11 లక్షల 54 వేల బకాయి ఉండగా, ఇప్పటి వరకు వసూళ్లు 23.38 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 31, 2026 నాటికి 100 శాతం వసూళ్లు పూర్తి చేయాలని కమిషనర్ వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లను ఆదేశించారు. పన్నులు చెల్లింపు విషయంలో ప్రతి ఇంటికీ చేరుకుని అవగాహన కల్పించాలని, బకాయిల వసూలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నిర్మల, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు పి. ఆదిత్య, పి. రాజేష్, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.