మే 31న కావేరమ్మపేటలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం

జడ్చర్ల, మే 25 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో వెలసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ (ఆదివారం) శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కల్యాణాన్ని పురస్కరించుకొని ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయంలో వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు సంపూర్ణ శ్రీమద్భగవద్గీత పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 7 గంటలకు నగర వీధుల్లో దేవతామూర్తుల శోభాయాత్ర అత్యంత కనులపండువగా సాగనుంది. ఉదయం 8 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకం, అనంతరం 1016 తమలపాకులతో భక్తిశ్రద్ధలతో ఆకు పూజ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు విచ్చేసిన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సుముహూర్త కల్యాణ వేడుకను ఉదయం 9 గంటలకు శాస్త్రోక్తంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిపించనున్నారు. కల్యాణోత్సవం ముగిసిన తర్వాత ఉదయం 11 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంతలక్ష్మిచే ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులందరికీ మహాప్రసాద వితరణ జరగనుంది. ఉత్సవానికి జడ్చర్ల పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని, కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు.



