బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నిజాం కాలేజ్ విద్యార్థినులు
హైదరాబాద్ : గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50 శాతం, యూజీ అమ్మాయిలకు 50 శాతం కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు ధర్నా చేపట్టారు.ఈ క్రమంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గతంలో మీరిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 100 శాతం యూజీ విద్యార్థినులకు కేటాయించేలా చూడాలని విద్యార్థినులు కోరారు. అమ్మాయిల ధర్నా పట్ల సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి కేటాయింపుల మాదిరిగానే 100 శాతం యూజీ విద్యార్థినులకు కేటాయించి వారికి న్యాయం చేయాల్సిందిగా నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా నాయక్‌కు సబితా ఇంద్రారెడ్డి సూచించారు.నిజాం కాలేజీ విద్యార్థినుల ధర్నా ఆరో రోజుకు చేరింది. ఇవాళ వంటావార్పునకు నిజాం కాలేజీ యూజీ విద్యార్థినులు పిలుపునిచ్చారు. వసతి గృహాన్ని యూజీ విద్యార్థినులకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.