మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే

రాజధానిలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్‌ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 16 బృందాలు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మేడ్చల్‌లో 5 బృందాలు సర్వే చేస్తున్నాయి. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలకు మార్కింగ్‌ చేస్తున్నారు.చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. హిమాయత్‌నగర్‌ తహసీల్దార్‌ సంధ్యారాణి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌ ప్రాంతంలోనూ సర్వే చేశారు. లంగర్‌హౌస్‌ డిఫెన్స్‌ కాలనీలో అధికారులు సర్వే చేస్తున్నారు. రివర్‌బెడ్‌లో నిర్మాణాలకు మార్కింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే 13 వేలకుపైగా ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ముసీ సుందరీకరణలో భాగంగా నదీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.కాగా, ప్రాణాలైనా ఇస్తాం కానీ.. హైడ్రా బుల్డోజర్లను రానిచ్చేది లేదంటూ మూసీ పరీవాహక ప్రాంత వాసులు అంటున్నారు. తమకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. రూపాయి రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టుకున్నామని చెబుతున్నారు. మూసీ వెంట ఉన్నది అందరం లేబర్లమేనని, తమను తీసుకొని ఎక్కడో వేస్తే ఏం చేసుకొని బతకాలని ప్రశ్నిస్తున్నారు. డబుల్‌ బెడ్రూం అందజేసే ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుందని, అప్పటి వరకు తాము ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేండ్లలో ఎప్పుడు ఇలాంటి మనసులేని సీఎంను చూడలేదని వాపోతున్నారు. రేవంత్‌ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.