డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్
డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేయగా, 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి. అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు. వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ పరిశీలనకు పంపించారు. దీంతో కథ మొదటికొచ్చింది. డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్ మార్కుల అప్‌లోడింగ్, సవరణకు విద్యాశాఖ అవకాశమివ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగుచూశాయి. సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్‌లోడ్ చేసినా పాతవే ప్రత్యక్ష్యమయ్యా యి. ఒక సబ్జెక్టుకు పరీక్షరాస్తే మరో సబ్జెక్టు వెబ్‌సైట్‌లో చూపించింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది. అయితే దీనిపై ముందుకెళ్లాలా..లేక ఇప్పటికే ప్రకటించిన తుది ‘కీ’ ప్రకారమే నడుచుకోవాలా..? అన్న విషయంలో విద్యాశాఖ ఏదీ తేల్చుకోలేకపోతున్నది. దీంతోనే ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది.