చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవులు …

తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్‌ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు లభించాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఆయనతో పాటు పదవీప్రమాణం చేసే మొత్తం 25 మంది మంత్రుల పేర్లను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి నాలుగు పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్‌, దుర్గేశ్‌.. కమ్మ వర్గానికి చెందిన లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌కు.. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎం.రాంప్రసాద్‌రెడ్డికి అవకాశం లభించింది.

ఎస్సీ కోటాలో అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్‌ చోటు సంపాదించారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్‌ కూర్పునకు చంద్రబాబు ఓ ఫార్ములా రూపొందించారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి (సత్యకుమార్‌).. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి. పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి సుభాష్‌, సత్యకుమార్‌, సవిత ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యఽధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అలాగే శాసనమండలి నుంచి ఎవరికీ దక్కలేదు.

సామాజిక వర్గాల వారిగా మంత్రుల జాబితా..
డోలా బాల వీరాంజనేయ స్వామి (ఎస్సీ మాల)
వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
టీజీ భరత్ (ఆర్య వైశ్య)
ఆనం రామనారాయణ రెడ్డి (రెడ్డి),
బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి)
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (రెడ్డి)
నిమ్మల రామానాయుడు (కాపు)
పవన్ కల్యాణ్ (కాపు)
కందుల దుర్గేష్ (కాపు)
పొంగూరు నారాయణ (బలిజ)
నారా లోకేశ్ (కమ్మ)
నాదెండ్ల మనోహర్ (కమ్మ)
పయ్యావుల కేశవ్ (కమ్మ)
గొట్టిపాటి రవికుమార్ (కమ్మ)
కొలుసు పార్థసారథి (బీసీ, యాదవ)
సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
ఎస్. సవిత (కురబ)