నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్

గంభీరావుపేట, డిసెంబర్ 03 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట స్థానిక ఎన్నికల్లో భాగంగాగ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆర్ఓ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. నామినేషన్ తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తరువాత వారితో ఎన్నికల నియమావళి, వ్యయం వివరాల అందజేతపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.అనంతరం హెల్ప్ డెస్క్ పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. కేజీ టూ పీజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో తరగతి గదిలో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం మెనూపై ఆరా తీశారు.
కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, ఇంచార్జి ఎంపీడీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



