తెలంగాణలో విద్యావిప్లవానికి ఆరుట్ల నుంచే శ్రీకారం

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్
వచ్చే నెల 15న సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ లు
అధునాతన హంగుల ప్రభుత్వ బడిని చూసి హర్షం
విప్ లను సన్మానించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం,మే 8(జనంసాక్షి )రాష్ట్ర ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టు కింద ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేవలం ఒక బడి మాత్రమే కాదు తెలంగాణ విద్యా వ్యవస్థలో రాబోయే విప్లవాత్మక మార్పులకు ఒక ప్రయోగశాలగా ప్రభుత్వ విప్ లు అభివర్ణించారు. ఇక్కడి ప్రతీ సౌకర్యం ఇంటర్నేషనల్ స్కూల్ కు ధీటుగా ఉండటం విద్యావ్యవస్థ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, రామచందర్ నాయక్ , అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ సందర్శించారు. శుక్రవారం ఉదయం ఆరుట్ల గ్రామానికి చేరుకున్న వీరికి స్వాగతం పలికిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణం, సౌకర్యాలు, పనితీరు గురించి రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి వారికి వివరించారు. ఇంటిగ్రేటెడ్ విద్యా వ్యవస్థ, అధునాతన తరగతి గదులు, ఉచిత బస్సు సౌకర్యం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడామైదానం, జిమ్, భోజన సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను ఆకునూరి మురళి, ఎమ్మెల్యే మల్ రెడ్డి వివరించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్ని తలదన్నేలా ప్రభుత్వం నిర్మిస్తున్న పాఠశాలను చూసి ప్రభుత్వ విప్ లు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తీరుగా రాష్ట్రంలో 100 చోట్ల తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందుకోసం ఆరుట్ల పాఠశాలను నమూనాగా తీసుకోనున్నట్లు తెలిపారు. భావిభారతం అభివృద్ధిపథంలో సాగాలంటే విద్య అతిముఖ్యమని అందుకోసమే విద్యావ్యవస్థను బాగుచేసి, దేశభవిష్యత్తుకు ప్రభుత్వం బంగారుబాటలు వేస్తుందని చెప్పారు.
ఇబ్రహీంపట్నం ప్రజల అదృష్టంగా భావిస్తున్నాః ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రాష్ట్ర విద్యావిప్లవానికి తమనియోజకవర్గం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఇబ్రహీంపట్నం ప్రజల అదృష్టంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి మార్గదర్శకంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ పబ్లిక్ స్కూల్ పూర్తైందని చెప్పారు. విద్యావైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సారి బడ్జెట్ లో రూ.26వేల కోట్లకు పైగా విద్యకు కేటాయింపులు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. పేదలందరికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో విద్యనందించిన నైపుణ్యం గల యువతను దేశానికి అందించటమే లక్ష్యంగా పనిచేస్తోందని… ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పారు.



